లాల్‌దర్వాజా బోనాలు నేడే

28 Jul, 2019 08:41 IST|Sakshi

సాక్షి, చాంద్రాయణగుట్ట : బోనాల జాతరకు లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం ముస్తాబైంది. ఆదివారం ఉదయం అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. ఇందుకోసం శనివారం ఉదయం నుంచే ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఆలయ పరిసరాల్లో మోహరించారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు చేయించారు. అమ్మవారికి ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు బలిహరణ, ఉదయం 6 గంటలకు మాజీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌ గౌడ్‌ చేతుల మీదుగా దేవి మహాభిషేకం చేస్తారు.

అనంతరం బోనాల సమర్పణ ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ చైర్మన్‌ తిరుపతి నర్సింగరావు తెలిపారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం చేయనున్నట్టు చెప్పారు. లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల్లో మంత్రులు మహమూద్‌ అలీ, మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్, మాజీ ఎంపీలు కవిత, విజయశాంతి, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కాగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం పాతబస్తీకి ఆర్టీసీ ‘లాల్‌దర్వాజా బోనాలు’ పేరుతో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు