10 వేల జనాభాకు 8 మందే డాక్టర్లు

15 Jul, 2020 02:00 IST|Sakshi

కరోనా నేపథ్యంలో దేశంలో పరిస్థితిపై లాన్సెట్‌ విశ్లేషణ

సాక్షి, హైదరాబాద్ ‌: మన దేశంలో ప్రతీ 10 వేల జనాభాకు ఎనిమిది మంది కంటే కొంచెం తక్కువగానే డాక్టర్లు ఉన్నారని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తెలిపింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల పరిస్థితిని విశ్లేషిస్తూ, భారత్‌లో పరిస్థితిపైనా తాజాగా విడుదల చేసిన నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. భారతదేశంలో మూడు నెలల లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత కేసులు మరింతగా పెరుగుతున్నాయని తేల్చిచెప్పింది. ఆ నివేదిక ప్రకారం... మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాలు అత్యధికంగా కరోనాతో దెబ్బతిన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభా విత ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లోనూ గణనీయమైన సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. (ఆన్‌లైన్‌ ఈ ‘లైన్‌’లో)

కాబట్టి మున్ముందు వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశాలున్నాయని తేల్చిచెప్పింది. ‘దీనికి ప్రధాన కారణం లాక్‌డౌన్‌ సమయంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వైఫల్యం జరిగింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించలేద’ని ల్యాన్సెట్‌ ఘాటైన విమర్శలు చేసింది. వైద్య ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన, పునర్నిర్మాణం జరగలేదు. వైద్య, ఆరోగ్య సిబ్బంది నియామకం జరగలేదు. దీనిపై ఇప్పటికైనా దృష్టిసారించాలని, రాబోయే నెలల్లో కరోనా వైరస్‌ను అంతం చేయడానికి ఇది కీలకమని ల్యాన్సెట్‌ వ్యాఖ్యానించింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికా, బ్రెజిల్‌తోపాటు భారతదేశంలోనూ జూన్‌ 26 నుండి జూలై 3 వరకు లక్షకన్నా ఎక్కువ కొత్త కేసులు నమోదు కావడాన్ని ల్యాన్సెట్‌ ప్రత్యేకంగా ప్రస్తావించింది. 

పేదలపై పంజా...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అందులో ఎక్కువగా పేదలను కాటేస్తోంది. ప్రపంచ జనాభాలో 66 శాతం మంది పేదలున్నారు. ఆ వర్గాలను మరింత పేదలుగా మార్చే దుస్థితి కరోనా కారణంగా ఏర్పడిందని ల్యాన్సెట్‌ పేర్కొంది. కరోనా రష్యాలో కూడా ఉధృతంగా కొనసాగుతోంది. ఇది మధ్య ఆసియా గుండా మధ్యప్రాచ్యం, భారత ఉపఖండంలోకి ప్రవేశించేలా ఒక బలమైన గొలుసుకట్టును ఏర్పరుచుకుంది. 

ఆదర్శంగా సౌదీ అరేబియా...
సౌదీ అరేబియా కరోనా నేపథ్యంలో ఆరోగ్యరంగానికి మరింత బడ్జెట్‌ను కేటాయించింది. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ పడకల సామర్థ్యాన్ని విస్తరించింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులకు ఉచిత ప్రవేశం కల్పించడానికి వందలాది జ్వరం క్లినిక్‌లను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బందికి అవసరమైన ప్రత్యేక శిక్షణ కల్పించిందని ల్యాన్సెట్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఐదు నెలల తరువాత కూడా వైరస్‌ సంక్లిష్టత కొనసాగుతూనే ఉందని తెలిపింది.

మరిన్ని వార్తలు