రైతు వేదికకు.. స్థలం కొరత!

22 Oct, 2018 12:01 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు సత్వర, మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయదలచిన రైతు వేదికలకు గ్రహణం వీడటం లేదు. నెలలు గడుస్తున్నా భూ సేకరణ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. వేదిక నిర్మాణానికి కావాల్సిన స్థల లభ్యత గగనంగా మారింది. ముఖ్యంగా మహానగర శివారు ప్రాంత మండలాల పరిధిలో భూమి అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా పరిణమించింది. జిల్లా వ్యవసాయ శాఖ పరిధిలో మొత్తం 83 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్‌లో ఒక రైతు వేదికను ఏర్పాటు చేయాలని రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన స్థలాన్ని సేకరించాల్సిన బాధ్యతలను రెవెన్యూ శాఖకు అప్పగించింది.

ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి 20 గుంటల (అర ఎకరం) భూమి అవసరం. ఇప్పటివరకు 50 చోట్ల స్థలాలను గుర్తించి.. ఈ జాబితాను వ్యవసాయ శాఖకు పంపించారు. మిగిలిన 33 చోట్ల స్థలం అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. క్లస్టర్‌ పరిధిలో రైతులందరికీ అనువైన ప్రాంతంలో స్థలం ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్నది ప్రభుత్వ భావన. అయితే అటువంటి ప్రాంతాల్లో జాగ దొరకడం లేదు. అంతేగాక హయత్‌నగర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం తదితర మండలాల్లో స్థల లభ్యత లేదు. దీంతో ఈ మండలాల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందం గా తయారైంది. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

 
సమన్వయ లోపం.. 
వ్యవసాయ శాఖలో సమన్వయం లోపం కూడా నిధుల విడుదలకు కాస్త అడ్డంకిగా మారింది. స్థలాలు గుర్తించిన చోట రైతు వేదికల నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు.. వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. అయితే వీటిని కమిషనరేట్‌ తిరస్కరించినట్లు తెలిసిందే. రెవెన్యూ శాఖ గుర్తించిన స్థలాలను వ్యవసాయశాఖకు అప్పగిస్తేనే నిధులు విడుదల చేస్తామని కమిషనరేట్‌ స్పష్టం చేసింది. తొలుతే ఈ విషయాన్ని వెల్లడించి ఉంటే.. ఈ పాటికి ఆయా చోట్ల రైతు వేదికల నిర్మాణం మొదలయ్యేది. గుర్తించిన స్థలాలను తమకు అప్పగించాలని రెవెన్యూశాఖకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లేఖలు పంపారు. త్వరలో స్థలాలను స్వాధీనం చేసుకోనున్నారు.


వేదికలతో మేలు.. 
20 గుంటల విస్తీర్ణంలో రైతు వేదికను ఏర్పాటు చేస్తారు. ఒక్కో దానికి నిర్మాణానికి రూ.12 నుంచి రూ.16 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. ఈ భవనంలో మినీ భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పా టు చేస్తారు. అలాగే వ్యవసాయశాఖ విస్తరణాధికారికి (ఏఈఓ) ప్రత్యేక చాంబర్, రైతులు సమావేశాలు నిర్వహించడానికి వీలుగా మీటింగ్‌ హాల్, విశాలమైన పార్కింగ్‌ స్థలం, శిక్షణ తరగతులకు మరో హాల్‌ తదితర సౌకర్యాలు కల్పించాలన్నది లక్ష్యం. తద్వారా స్థానికంగానే తమకు అవసరమైన పనులను అన్నదాతలు చక్కబెట్టుకోవచ్చు.

మరిన్ని వార్తలు