వేగంగా ‘కాళేశ్వరం’ భూసేకరణ

16 Dec, 2016 02:15 IST|Sakshi
వేగంగా ‘కాళేశ్వరం’ భూసేకరణ

ప్రాజెక్టు పురోగతి సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం
పట్టా భూముల పరిహారమే అసైన్డ్‌ భూములకూ ఇవ్వండి
రైతుల త్యాగం వెల కట్టలేనిది..
వారిని నొప్పించకుండా పనులు చక్కబెట్టండి  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పురోగతిని సీఎం కేసీఆర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అందువల్ల అలసత్వం పనికిరాదని సూచించారు. ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భూసేకరణ పనుల పురోగతిని హరీశ్‌రావు గురువారం అసెంబ్లీ హాలులో సమీక్షించారు. ప్రభుత్వంతోపాటు కాంట్రాక్టు ఏజన్సీలకూ ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైనదని... అందువల్ల అధికార యంత్రాంగం, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత వ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భూసేకరణ పూర్తయిన చోట నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కాంట్రాక్టు ఏజెన్సీలను మంత్రి కోరారు.

బ్యారేజీల నిర్మాణ ప్రాంతం వద్ద ఇసుక తవ్వకానికి అనుమతులివ్వాలని కలెక్టర్లకు సూచించారు. భూసేకరణ వ్యవహారంలో ఆర్డీఓలు చురుగ్గా పనిచేయాలని... కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చెందిన డ్రాయింగ్‌లు, డిజైనులు త్వరితగతిన పూర్తి చేసి ఏజెన్సీలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్‌ జరిగే సమయంలోనే రైతుకు పరిహారం చెల్లింపులు జరగాలని, చెల్లింపుల్లో జాప్యం తగదన్నారు. పట్టా భూములకు ఇచ్చినట్లే అసైన్డు భూములకూ అదే స్థాయిలో పరిహారం ఇవ్వాలన్నారు. భూములిచ్చే రైతుల త్యాగం వెలకట్ట లేనిదని, వారితో మర్యాదగా మెలగాలని, గౌరవంగా మాట్లాడాలని హరీశ్‌రావు సూచించారు.

రైతులకు అవగాహన...
రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన రైతులకు ప్రయోజనం కలిగించే కాళేశ్వరం ప్రాజెక్టును ఏదోవిధంగా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుతంత్రాలు పన్నుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రతిపక్షాల వలలో రైతులు పడకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనులపై హైదరాబాద్‌ నుంచి పర్యవేక్షించేందుకు వీలుగా నిర్మాణ స్థలం నుంచి వీడియో కెమెరాలను జలసౌధకు అనుసంధానించే ప్రతిపాదనలపై అధికారులతో హరీశ్‌రావు చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జోషీ, ఈఎన్‌సీ మురళిధర్‌రావు, జయశంకర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా కలెక్టర్లు మురళి, అమృత వర్షిణి, కన్నన్, సీఈలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు