ఖాళీ స్థలం విషయంలో వివాదం 

2 Aug, 2019 10:54 IST|Sakshi

విద్యార్థులు, కాలనీవాసుల మధ్య వాగ్వాదం 

వేర్వేరుగా హామీలిచ్చిన సర్పంచ్, ఎంపీపీ 

చేవెళ్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రహారీ, అంగడిబజారు కాలనీకి మధ్యలో ఉన్న వ్యవసాయశాఖకు కేటాయించిన గోదాం స్థలం విషయంలో వివాదం నెలకొంది. కాలనీవాసులు కమ్యూనిటీ హాల్‌ నిర్మించేందుకు గురువారం పనులు చేస్తుండగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి వచ్చి అడ్డుకున్నారు. దీంతో నాయకులు కల్పించుకొని అందరి సమక్షంలో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సర్దిచెప్పారు. వివరాలు.. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలిక పాఠశాలకు అంగడి బజారు కాలనీకి మధ్య కొన్నేళ్ల క్రితం వ్యవసాయశాఖ అధికారులు గోదాం నిర్మించారు. అది శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా ఉంది. దీంతో అది కాలనీవాసులకు, అటు పాఠశాల విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఖాళీ స్థలంలోంచి పాములు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో స్థానిక నాయకులు నిర్మాణాన్ని కూల్చివేసి చదును చేశారు. ఖాళీ స్థలం ఉండడంతో తమకు కమ్యూనిటీ హాల్‌ కావాలని కోరగా సర్పంచ్‌ బండారి శైలజ ఆగిరెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇటీవల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి పాఠశాల సందర్శనకు వెళ్లినప్పుడు.. ఖాళీ స్థలం విద్యార్థుల మరుగుదొడ్లకు ఆనుకొని ఉందని, దీనిని ఆటస్థలంగా కేటాయిస్తే ఉపయోగంగా ఉంటుందని కోరారు.

దీంతో ఎంపీపీ తన సొంత డబ్బులు వినియోగించి చేయిస్తానని హామీ ఇచ్చారు. దీనికి ప్రహారీ నిర్మించి ఇస్తే విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని బుధవారం పనులు చేసేందుకు సామగ్రిని ఎంపీపీ తెప్పించారు. ఈనేపథ్యంలో కాలనీవాసులు ఇది తమకు అనుకూలంగా ఉందని, ఇది అందరికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నారు. కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తామని సర్పంచ్‌ హామీ ఇచ్చారని గురువారం కాలనీవాసులు పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వచ్చి పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ స్థలం విషయంలో అటు ఎంపీపీ, ఇటు సర్పంచ్‌ వేర్వేరుగా హామీలు ఇవ్వడంతో ఈ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అక్కడికి వచ్చిన ఎంపీటీసీ వసంతం, ఉప సర్పంచ్‌ టేకులపల్లి శ్రీనివాస్, వార్డుసభ్యులు ఇరుర్గాలకు నచ్చజెప్పారు. దీనిపై పెద్దలంతా కలిసి పంచాయతీ ఆధ్వర్యంలో మాట్లాడి స్థలం ఎవరికి కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అప్పటి వరకు నిరీక్షించాలని ఉపాధ్యాయులను, విద్యార్థులను పంపించారు. అయితే, ఈ స్థలం విషయంలో ‘ఎంపీపీ వర్సెస్‌ సర్పంచ్‌’ అన్నట్లుగా స్థానికంగా సోషల్‌ మీడియలో జోరుగా ప్రచారం జరిగింది. చివరకు స్థలం ఎవరికి కేటాయిస్తారనే విషయం ఉత్కంఠగా మారింది. 

మరిన్ని వార్తలు