తొలిదశలో 75 గ్రామాల్లోనే..

13 Aug, 2014 02:47 IST|Sakshi

* అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమికే పట్టాలు..
* నిరుపేద దళితులకు భూపంపిణీకి సర్కారు ఏర్పాట్లు
* 15న నల్లగొండలో ప్రారంభం!

 
 సాక్షి, హైదరాబాద్: నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ పథకం తొలి దశను లాంఛనంగా ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గానికి ఒక గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని తొలుత నిర్ణయించినా.. ప్రస్తుతమది 75 గ్రామాలకే పరిమితమైంది. అర్బన్ నియోజకవర్గాలు దాదాపు 30 తీసేయడంతోపాటు భూపంపిణీ చేయడానికి అనువైన భూములులేని నియోజకవర్గాలను కూడా దీన్నుంచి మినహాయించారు. ఈ నెల 15న భూపంపిణీ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో ప్రారంభించే అవకాశం ఉందని అధికారవర్గా లు వివరించాయి.  వాస్తవానికి ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే, లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందున తొలుత నియోజకవర్గంలోని ఒక గ్రామంలో నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయాలని నిర్ణయించింది.
 
 భూముల కొనుగోలు కోసం రూ.185 కోట్లు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చినప్పటికీ.. ఇప్పటికిప్పుడు భూముల కొనుగోలు సాధ్యమయ్యే పని కాదని.. అందువల్ల ప్రభుత్వ భూమి ఉన్న గ్రామాలను మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే.. ఎంత మంది రైతులకు భూ పంపిణీ చేయాలన్న అంశంపై ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. అందుబాటులో ఉన్న సాగు యోగ్యమైన భూమి ఎంత అన్నదానిపై అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఎంతమందికి ఇవ్వాలన్నదానిపై జిల్లాల్లో ఇంకా కసరత్తు కొనసాగుతోంది. ఈ పథకంలో భాగంగా కేవలం భూపంపిణీయే కాకుండా బోర్లు వేయడం, కరెంటు కనెక్షన్లతోపాటు  సాగు వ్యయాన్ని కూడా వారికి అందించనున్నారు. మరోవైపు సాగుయోగ్యమైన భూమి లభిం చడం లేదని కలెక్టర్ల నుంచి నివేదికలు వస్తున్నట్లు సమాచారం. భూ సేకరణ చట్టం కింద భూములు తీసుకోవడం ఇప్పుడు కష్టసాధ్యంగా మారిందని చెబుతున్నారు. దళితులకు భూ పంపిణీ చేయడానికి భూ సేకరణ చేస్తున్నారనగానే.. భూముల ధరలూ పెంచారని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి.

మరిన్ని వార్తలు