లక్ష్యానికి దూరంగా దళితుల భూపంపిణీ

29 Feb, 2016 04:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంపై ఆధారపడిన భూమిలేని పేద దళితుల కుటుంబాలకు భూమిని పంపిణీ చేయాలనే ప్రభుత్వ ఆశయం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. దళితులకు భూపంపిణీ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదివేల ఎకరాలు పంపిణీ చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించట్లేదు.

ఈ ఏడాది 3,334 మందికి భూపంపిణీ చేయాలని ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) నిర్ణయించింది. ఇటీవలే ఈ పథ కం తీరుతెన్నులపై కార్పొరేషన్ అధికారులు, జిల్లా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించి మార్చి రెండోవారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

ఇప్పటివరకు 1,598 మందికి 4,190 ఎకరాలు మాత్రమే పంపిణీచేశారు. అంటే మరో పది, పదిహేను రోజుల్లో ఇంకా 1,730 మందికి 5,810 ఎకరాలు పంపిణీచేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో ఇది ఏ మేరకు సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటిదాకా 4,190 ఎకరాలను లబ్ధిదారులకు మంజూరు చేసినా, కేవలం 902 మందికి 2,450 ఎకరాలు మాత్రమే భూమిని రిజిష్టర్ చేసి పట్టాలు, పాసు పుస్తకాలు అందజేశారు. అదీగాక భూమి పంపిణీ చేసిన రైతులకు  భూమి అభివృద్ధి కింద కూడా కరెంట్ మోటార్లు బిగించడం, వ్యవసాయానికి అవసరమైన వివిధ రకాల సహాయాలు అందించాల్సి ఉంది. అయితే దీనిపైనా జిల్లాస్థాయిలో కలెక్టర్లు మొదలుకుని కిందిస్థాయి వరకు పెద్దగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.

మరిన్ని వార్తలు