ప్రారంభం పరిమితమే!

15 Aug, 2014 00:34 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ సర్కారు ఎంతో ఆర్భాటంగా అమలు చేస్తున్న దళితులకు భూపంపిణీ పథకం అమలులో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ భూపంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రకటించిన ప్రభుత్వం తొలిసారి పరిమితంగానే లబ్ధిదారులను ఎంపిక చేసింది. కేవలం ఐదుగురు లబ్ధిదారులతో ఈ పథకాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించింది.

ఈ మేరకు హైదరాబాద్‌లో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లాకు చెందిన ఈ ఐదుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లబ్ధిపత్రాలు జారీ చే యాలని నిర్ణయించారు. మంత్రి జోగు రామన్న ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండ లం కాప్రి గ్రామానికి చెందిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. అయితే జిల్లాలో మాత్రం కొందరికి ఈ లబ్ధిపత్రాల ను అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా మండలానికి ఒక గ్రామం చొప్పున జిల్లాలో 52గ్రామాల్లో అ ర్హులైన దళిత నిరుపేద కుటుంబాలకు భూ పంపిణీ చేయాల ని నిర్ణయించారు.

కానీ ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయడం వీలుకుదరకపోవడంతో నియోజకవర్గానికి ఒక గ్రామం చొ ప్పున ఎంపిక చేశారు. అయినప్పటికీ పంపిణీ చేయాల్సిన భూముల సేకరణ పూర్తికాకపోవడంతో కేవలం ఐదుగురు ల బ్ధిదారులతో సరిపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.పంద్రాగస్టు వేడుకల్లో వీలైతే కొందరికి లబ్ధిపత్రాలను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో వేలాది దళిత కుటుంబాలు భూము లు లేక నిరుపేద రైతుకూలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఐకేపీ, సెర్ఫ్ వంటి ప్రభుత్వ శాఖల సర్వే ప్రకారం జిల్లాలో సుమారు 91వేలకు పైగా దళిత కుటుంబాలున్నట్లు అంచనా.

 కొలిక్కిరాని భూసేకరణ
 భూమిలేని నిరుపేద దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని భారీ లక్ష్యంతో తెలంగాణ సర్కారు ఈ దళిత బస్తీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే సాగుకు యోగ్యమైన భూములు జిల్లాలో తగినన్ని అందుబాటులో లేకపోవడంతో ఈ పథకం అమలులో అవాంతరాలు ఎదురవుతున్నాయి. పట్టా భూమిని కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతానికి జిల్లాలో పది నియోజకవర్గాల పరిధిలో 110 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.

వీరికి మూడెకరాల చొప్పున భూ పంపిణీ చేసేందుకు 323.39 ఎకరాలు సాగుభూమి అవసరం ఏర్పడింది. కానీ ప్రభుత్వ భూమి కేవలం 53.10 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో మిగిలిన 270.03 ఎకరాలు ప్రైవేటు భూములు కొనుగోలు చేసి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ భూసేకరణ కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని నియమించారు. జాయింట్ కలెక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఆయా డివిజన్ల ఆర్డీవోలు సభ్యులుగా ఉన్నారు.

 విడుదల కాని నిధులు
 జిల్లాలో సాగుకు యోగ్యమైన భూములు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు భూములను సేకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే ఈ భూ సేకరణకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. కేవలం సర్వే నిమిత్తం రూ.25 లక్షలు మాత్రమే మంజూరైనట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఈ నిధులు విడుదలవుతాయని తెలిపారు.

>
మరిన్ని వార్తలు