కబ్జాదారుల బరితెగింపు

24 Dec, 2018 10:52 IST|Sakshi

ఆక్రమణలు తొలగిస్తున్నారని తహసీల్దార్‌పై దాడి

ఆర్‌ఐపై కిరోసిన్‌ చల్లి నిప్పంటించే యత్నం

గాజులరామారంలో ఉద్రిక్తత

వెనక్కి తగ్గని అధికారులు.. ఆక్రమణల కూల్చివేత  

కబ్జాదారులపై ‘పీడీ’ చట్టం ప్రయోగం!

కుత్బుల్లాపూర్‌: భూకబ్జాదారులు బరితెగించారు. మొన్న వీఆర్‌ఏపై కర్రలతో దాడి చేసిన సంఘటన మరువక ముందే ఆక్రమణలను తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులపై దాడి చేసిన సంఘటన కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజులరామారంలో చోటుచేసుకుంది. స్థానిక సర్వే నెంబర్‌ 329/1 కట్టమైసమ్మ బస్తీలోని ప్రభుత్వ స్థలంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆదివారం కుత్బుల్లాపూర్‌ మండల తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్, ఆర్‌ఐ నరేందర్‌రెడ్డి, వీఆర్వోలువీఆర్‌ఏలతో కలిసి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయసాగారు. ఈ క్రమంలో పలువురు కబ్జాదారులు మహిళలను రెచ్చగొట్టడంతో వారు తహసీల్దార్‌పై రాళ్ల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా ఆర్‌ఐ నరేందర్‌రెడ్డిపై కిరోసిన్‌ చల్లి నిప్పంటించే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారులను, సిబ్బందిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ మాత్రం విషయాన్ని సీరియస్‌గా తీసుకుని మూడు గదులను సీజ్‌ చేసి, రెండు బేస్‌మెంట్లను నేలమట్టం చేశారు. 

కబ్జాదారులపై బిగిసిన ‘పిడి’కిలి
గాజులరామారం పరిధిలో ఇటీవల కాలంలో కబ్జాదారులు రెచ్చిపోయి ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు వేస్తున్నారు. వాటిని అమాయకులకు కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ స్థలంలో వెలిసిన నిర్మాణాలను అ«ధికారులు కూల్చివేస్తున్నప్పటికీ కబ్జాదారులు మాత్రం శుక్ర, శని, ఆదివారాల్లో  గదులు నిర్మించి విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు.  ఆదివారం కబ్జాదారుడు మజర్‌ఖాన్‌ సర్వే నెంబరు 23 కొత్తకుంట చెరువు పక్కనే నిర్మించిన ఇంటిని అధికారులు సీజ్‌ చేశారు. గాజులరామారం, రావి నారాయణరెడ్డినగర్, కైసర్‌నగర్‌ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ప్రభుత్వ స్థలాలను కబళించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్న కబ్జాదారులపై మండల తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ దృష్టి పెట్టారు. ఇప్పటికే ఇక్కడ భూములను ఆక్రమించుకుంటున్న ఇంతియాజ్‌ అనే వ్యక్తిపై జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం కూల్చివేతల నేపధ్యంలో స్థానికుల సమాచారం మేరకు గడ్డం కృష్ణ, రాజన్న, మదర్‌ఖాన్‌ను కట్టడి చేస్తే స్థానికంగా కబ్జాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం వీరిపై ‘పిడి’ చట్టం ప్రయోగించాలని అధికారులు నిర్ణయించారు. అదే విధంగా ఓ టీఎమ్మార్పీస్‌ నేత, ఓ ఆర్‌ఎంపీ, ఓ మహిళా వార్డు మెంబర్, టీఆర్‌ఎస్‌ నేత, బంజారా నేత, వడ్డెర సంఘం నేతతో పాటు ఇంకా పలువురు స్థానిక ఆక్రమణదారులపై అందిచిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్నారు. వీరిపై కూడా ల్యాండ్‌ గ్రాబింగ్‌ కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

కబ్జా చేస్తే సహించం..
ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టినా, వాటిని కొనుగోలు చేసినా,  అమ్మినా సహించే ప్రసక్తి లేదు. ఆదివారం కైసర్‌నగర్, దేవేందర్‌నగర్, రావి నారాయణరెడ్డినగర్, కట్టమైసమ్మ బస్తీ, రింగ్‌ బస్తీ, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో కబ్జాలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి అక్రమ నిర్మాణాలు తొలగించాం. త్వరలో కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కుత్బుల్లాపూర్‌లో ఉన్న అన్ని ప్రభుత్వ స్థలాలపై సమగ్ర నివేదిక తయారు చేస్తున్నాం. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటాం.– గౌతమ్‌కుమార్, కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌

మరిన్ని వార్తలు