రహదారి మాయం..!

26 Aug, 2019 07:02 IST|Sakshi
మెదక్‌పట్టణంలోని గంగినేని థియేటర్‌ ఎదురుగా అక్రమంగా నిర్మిస్తున్న భవనం

అక్రమార్కుల ‘మాస్టర్‌ ప్లాన్‌’      

ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో అక్రమ కట్టడాలు

పలుచోట్ల పూర్తయిన భవనాల నిర్మాణం

మెదక్‌ మున్సిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌–92కే ఎసరు పెట్టారు.. రహ‘దారులు’ మాయం చేశారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో రూపొందించిన ప్రణాళికలో పేర్కొన్న ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో యథేచ్ఛగా అక్రమ భవనాలు నిర్మించారు. ముడుపుల వల.. ప్రజాప్రతినిధుల అండతో మాస్టర్‌ప్లాన్‌ మార్పు, భవనాల క్రమబద్ధీకరణకు యత్నిస్తున్నారు. రూ.లక్షల మేర చేతులు మారిన ఈ వ్యవహారంలో బల్దియా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, మెదక్‌ : రానున్న కాలంలో ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి.. అందుకనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రతిపాదించిన రోడ్ల స్థలాలు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేని తనం వెరసి అక్రమ నిర్మాణాలకు నెలవుగా మారాయి. మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది.

ప్రధానంగా పట్టణం నడిబొడ్డున ఉన్న గంగినేని థియేటర్‌ పక్కన కెనాల్‌ మీదుగా పంప్‌హౌస్‌కు వెళ్లే దారితోపాటు అజాంపూర్‌లో మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదిత రోడ్డు స్థలంలో అక్రమ కట్టడాలు వెలిశాయి. వీటి నిర్మాణాలు ప్రారంభమైన సమయంలోనే పలువురు స్థానికులు మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సుమారు రెండేళ్లవుతున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో అజాంపూర్‌లో మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదిత రోడ్డుకు అడ్డంగా ఒక భవన నిర్మాణం పూర్తి అయింది. దీన్నే ఓ ప్రభుత్వ శాఖ అద్దెకు తీసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తుండడం గమనార్హం. ఇక పంప్‌హౌస్‌ దారిలో మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదిత రోడ్డు స్థలంలో సైతం రెండంతస్తుల భవన నిర్మాణం పూర్తయింది.

రెండేళ్లుగా చోద్యం.. 
మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అజాంపూర్‌లో ఓ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మాస్టర్‌ప్లాన్‌ను మార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. గతంలో మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో అజెండాలో పెట్టారు. అయితే.. అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులు వ్యతిరేకించగా దుమారం చెలరేగింది.

దీంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలిసింది. మరోవైపు మెదక్‌ ప్రధాన రహదారి సమీపంలోని గంగినేని థియేటర్‌ నుంచి పంప్‌ హౌస్‌కు వెళ్లే రూట్‌లో కెనాల్‌ను ఆనుకుని 50 అడుగుల దారిని నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. ఇందులో కెనాల్‌ నుంచి బండ్‌ 20 మీటర్లు ఉండగా.. మిగతా స్థలాన్ని మాస్టర్‌ ప్లాన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కెనాల్‌ను ఆనుకుని ఉన్న స్థలంలో ఒకరు గతంలోనే రెండంతస్తుల భవన నిర్మాణం మొదలుపెట్టారు. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయింది. అయితే సదరు భవన యజమాని గతంలో భవన క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా.. అధికారులు తిరస్కరించారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు సాగినా.. రెండేళ్లుగా అధికారులెవ్వరూ పట్టించుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆమ్యామ్యాలు రూ.10 లక్షలపైనే ?
మెదక్‌ పట్టణం నడిబొడ్డున మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదిత రోడ్డు స్థలాల్లో అక్రమ కట్టడాల తతంగంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. థియేటర్‌ సమీపంలోని భవనానికి సంబంధించి మున్సిపాలిటీ పాలకవర్గంలోని పలువురు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, బల్దియాలోని కింది స్థాయి సిబ్బందికి కలిసి సుమారు రూ.10 లక్షలు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిల్లర్ల నిర్మాణ సమయంలోనే ఫిర్యాదులు రాగా.. నిర్మాణాన్ని నిలిపేసినట్లు అధికారులు చెప్పారు. కానీ.. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయింది. అంటే ఇన్నాళ్లుగా చాటుమాటుగా పనులు కొనసాగినట్లు చెప్పవచ్చు. ప్రజాప్రతినిధుల అండతో మున్సిపల్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. అజాంపూర్‌కు సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ మార్చేందుకు జరిగి న యత్నంలో సైతం పెద్ద ఎత్తున డబ్బులు చేతు లు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా దృష్టి సారించాలి..
ఇవే కాకుండా.. మున్సిపల్‌ మాస్టర్‌ప్లాన్‌–92లో ప్రతిపాదించిన పట్టణ పరిధిలోని పలు రోడ్డు స్థలాలను పలువురు కబ్జా చేయగా.. కొందరు అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి.. అక్రమ కట్టడాలకు కళ్లెం వేయాలి. భవిష్యత్‌ అవసరాలను గుర్తెరిగి అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నోటీసులు జారీ చేస్తాం..
మాస్టర్‌ ప్లాన్‌ రహదారిలో కట్టడాలు నిర్మాణం నిషేధం. ఎవరైనా ఉల్లంఘిస్తేకఠిన చర్యలు తీసుకుంటాం. అజాంపూర్, పంప్‌హౌస్‌ దారికి సంబంధించి అక్రమ ని ర్మాణదారులకు నోటీసులు రెడీ చేయాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించా. 
– సమ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌  

మరిన్ని వార్తలు