ప్రక్షాళనకు పక్కా మార్గం

3 Sep, 2017 00:38 IST|Sakshi
ప్రక్షాళనకు పక్కా మార్గం

మూడు విభాగాలు.. ఆరు దశల్లో భూ రికార్డుల ప్రక్షాళన
- ఆన్‌లైన్‌లో పరిశీలనతో పాటు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు
- ప్రతీ ఇంటికీ సర్వే స్టిక్కర్లు.. వీఆర్వోలు, తహసీల్దార్లదే బాధ్యత
- ఆన్‌లైన్‌ పహాణీలలో మార్పులు, చేర్పులు
- 1బీ రికార్డుల సవరణ.. రిజిస్టర్‌లో నమోదు
- మార్పులు, చేర్పులతో తహసీల్దార్‌ ఉత్తర్వులు
- వాటిపై అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన
- తర్వాత మాన్యువల్‌ పహాణీ.. ఆన్‌లైన్‌లో నమోదు
- ఈ రికార్డుల ఆధారంగానే ఎకరానికి రూ.8 వేల సాయం అమలు
- ప్రతి గ్రామానికి రెవెన్యూ ప్రొఫైల్‌ కూడా ఏర్పాటు


ఇప్పుడు రాష్ట్రమంతా వినిపిస్తున్న మాట ‘భూ రికార్డుల ప్రక్షాళన’.. రైతులకు ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం తోపాటు.. రాష్ట్రంలో భూ వివాదాలను పరిష్కరించడం, అక్రమాలకు తావు లేకుం డా పక్కాగా రికార్డు లను అప్‌డేట్‌ చేయడం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రక్షాళనను చేపట్టారు. ఈనెల 15వ తేదీ నుంచి డిసెం బర్‌ 31 వరకు.. రాష్ట్రం లోని 10 వేలకుపైగా రెవెన్యూ గ్రామాల్లో జరిగే భూ రికార్డుల ప్రక్షాళన కోసం అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ యంత్రాంగం సిద్ధ మవుతోంది. అయితే ఈ భూ రికార్డుల ప్రక్షాళనలో ఏం చేస్తారు.., ఏ రికా ర్డులను, ఎలా ప్రక్షాళన చేస్తారు.. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారా.. రికార్డు ల్లో ఉన్నది ఉన్నట్టు రాసేస్తారా.. మార్పులు చేర్పులు చేస్తారా.. ఇలాంటి ఎన్నో సందేహాలు రాష్ట్ర రైతాంగంలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన సాగే తీరు, వివరాలపై ‘సాక్షి’ ఫోకస్‌..

ప్రతి గ్రామానికి రెవెన్యూ ప్రొఫైల్‌
భూ రికార్డుల ప్రక్షాళనలో భా గంగా ప్రతి గ్రామానికి రెవెన్యూ ప్రొఫైల్‌ కూడా రూపొందించను న్నారు అందులో మొత్తం 29 రకాల వివరాలను పొందుపరుస్తారు. గ్రామ భౌగోళిక విస్తీర్ణం, పట్టా భూములు, ప్రభుత్వ భూములు, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, ప్రాజెక్టుల కింద సేకరించిన భూ వివరాలు, మొత్తం సర్వే నంబర్లు, 18 ప్రకారం ఉన్న ఖాతాలు, ప్రస్తుత పహాణీకి ఉన్న మొత్తం ఖాతాలు, రైతు సమగ్ర సర్వే ప్రకారం తేడా ఉన్న ఖాతాల సంఖ్య, మొత్తం పట్టాదారులు, ఫౌతి చేయాల్సిన పట్టాదారులు, వ్యవసాయ విస్తీర్ణం, నాలా విస్తీర్ణం, ఇంటి స్థలం మరియు ఇళ్ల విస్తీర్ణం, ఇళ్ల స్థలాలకు, ప్రజావసరాలకు సేకరించిన భూమి విస్తీర్ణం, పరిశ్రమలకు ఎలినేషన్‌ చేసిన భూ విస్తీర్ణం, గ్రామంలో మొత్తం ప్రభుత్వ భూ విస్తీర్ణం, ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, అసైన్‌ చేయబడిన భూ విస్తీర్ణం, అసైనీదారుల సంఖ్య, పీవోటీ విస్తీర్ణం, సేద్యం చేయడానికి వీలుకాని అసైన్డ్‌ భూమి, పరిష్కారం కాని ఇనాం భూముల విస్తీర్ణం, నోటిఫైడ్‌ చెరువుల సంఖ్య, గుర్తింపులేని చెరువుల సంఖ్య, శిఖం భూముల విస్తీర్ణం, ఖస్రాకు, ప్రస్తుత పహా ణీకి సరిపడని సర్వే నంబర్ల సంఖ్య, వివాదంలో ఉన్న భూ సర్వే నంబర్ల సంఖ్య, ఆన్‌లైన్‌ పహాణీలో నమోదు చేయాల్సిన పట్టాదారుల సంఖ్య, పట్టాదారు, అనుభవదారు కాలమ్‌లకు సరిపడని సర్వే నంబర్ల సంఖ్య, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు గుర్తించబడిన భూమి విస్తీర్ణం, దళితులకు మూడెకరాల పంపిణీ కోసం రిజిస్టర్‌ చేసిన, సేకరించిన భూ విస్తీర్ణం, ఎవాక్యూ ప్రాపర్టీ విస్తీర్ణం వివరాల్ని గ్రామ రెవెన్యూ ప్రొఫైల్‌లో పొందుపరుస్తారు. దీన్ని ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేస్తారు.

(మేకల కల్యాణ్‌ చక్రవర్తి)
రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఇప్పటికే జరుగుతున్న భూ రికార్డుల సర్వే తరహాలో తాజా ప్రక్షాళన ప్రక్రియ జరుగనుంది. ఇటీవల కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర అధికారులతో సీఎం కేసీఆర్‌ నిర్వ హించిన సమీక్షా సమావేశంలోనే దీనిపై స్పష్టత వచ్చింది. ఇంతకుముందు చేపట్టిన సర్వేలో నల్ల గొండ జిల్లా కలెక్టర్‌ అనుసరించిన విధానం బాగుం దని.. తాజాగా చేపట్టే ప్రక్షాళన ప్రక్రియలో దానినే అనుసరించాలని కేసీఆర్‌ ఆ భేటీలో సూచించారు. దీంతో ఉన్నతాధికారులు ఆ విధానం ప్రకారమే భూరికార్డుల ప్రక్షాళన చేపట్టేలా ఏర్పాట్లు చేస్తు న్నారు. దాని ప్రకారం.. ఈ ప్రక్రియ 3 విభా గాలుగా ఆరు దశల్లో పూర్తి చేయనున్నారు. అయితే ఇంతకుముందు చేపట్టిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భూముల పరిశీలన జరిగింది. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలో 98%, నల్లగొండలో 85% మేర ప్రక్రియను పూర్తికావడం గమనార్హం. అయితే సెప్టెంబర్‌ 15 నుంచి గ్రామాల్లోకి బృందాల వారీగా వెళ్లి పరిశీలించనున్న నేపథ్యంలో.. అన్ని చోట్లా మరోసారి పరిశీలన చేయనున్నారు. ఏవైనా తేడాలు కనిపిస్తే.. తాజా పరిశీలన మేరకు ఆన్‌లైన్‌ రికార్డులు నమోదు చేయనున్నారు.

పరిగణనలోకి తీసుకునేవి ఇవే..
భూ రికార్డుల ప్రక్షాళన కోసం గతంలోని రెవెన్యూ రికార్డుల్లో సేత్వార్, ఖస్రా, చెస్సలా పహాణీలతో పాటు 2013–14 సంవత్సరం వరకు అందుబాటు లో ఉన్న మాన్యువల్‌ పహాణీలు, గత పదేళ్ల సవ రణల రిజిస్టర్లను పరిగణనలోకి తీసుకుంటు న్నారు. ఈ రికార్డుల్లో ఉన్న వివరాలను రైతుల వద్ద ఉన్న వివరాలతో సరిపోల్చి మార్పులు చేర్పులు చేస్తారు.

రైతు సమితుల పాత్ర నామమాత్రమే!
ఎకరానికి రూ.8 వేల పథకం అమలుకు, భవిష్యత్‌లో భూ మార్పిడి లావాదేవీలకు కీలకమవు తాయని భావిస్తున్న రైతు చైతన్య సమితులకు.. ప్రక్షాళనలో నామమాత్ర పాత్రే ఉండనుంది. ఎందుకంటే రెవెన్యూ రికార్డుల ఆధారంగానే ప్రక్షాళన జరుగుతోందని, దీనివల్ల స్థానిక రైతు కమిటీల పాత్ర పెద్దగా ఉండక పోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి.. రికార్డుల్లో మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా భూమిపై ఇద్దరు రైతుల మధ్య వివాదం తలెత్తినప్పుడు మాత్రం రైతు సమితుల పాత్ర కీలకం కానుంది. రైతు సమితి సమక్షంలోనే గ్రామంలో విచారణ జరిపి.. భూముల వివాదాలను పరిష్కరించనున్నారు.

ఇక తహసీల్దార్‌ తర్వాత కలెక్టరే
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని రకాల రెవెన్యూ కోర్టు లను రద్దు చేసి కేవలం కలెక్టర్‌ కోర్టును మాత్రమే ఉంచనున్నారు. దాంతో భూ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభించనుంది. గతంలో ఏదైనా భూ వివాదం తలెత్తితే దానిని సంబంధిత తహసీల్దార్‌ వద్ద సవాల్‌ చేసేవారు. ఉదా హరణకు మ్యుటేషన్‌ ప్రక్రియలో అభ్యంతరాలుంటే ఫాం–8 ద్వారా నోటీసులిచ్చి తహసీల్దార్‌ విచారణ జరిపి ఉత్తర్వులిచ్చేవారు. అయితే ఈ ఉత్తర్వులను 30 రోజుల్లోగా ఆర్డీవో కోర్టులో సవాల్‌ చేసే వెసులుబాటు ఉండేది. తర్వాత ఆర్డీవోలు ఇచ్చిన ఉత్తర్వులను 45 రోజుల్లోగా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) కోర్టులో సవాల్‌ చేసేందుకు అవకాశముండేది.

జేసీ కోర్టు ఇచ్చినవి కూడా తుది ఉత్తర్వులు కాదని.. వాటిని హైకోర్టులో సవాలు చేసేవారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముందునుంచీ కలెక్టర్‌ కోర్టులు ఉన్నా.. అవి నామమాత్రంగానే కొనసాగాయి. ప్రస్తుతం మళ్లీ కలెక్టర్‌ కోర్టులను క్రియాశీలం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్‌ కోర్టు తర్వాత నేరుగా కలెక్టర్‌ కోర్టుకే రావాల్సి ఉంటుంది. అయితే కలెక్టర్లు పనిఒత్తిడి నేపథ్యంలో తిరిగి ఈ కేసులను జాయింట్‌ కలెక్టర్లకే అప్పగించాల్సి వస్తుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

తొలిగ్రామం.. ముల్కలకాల్వ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ముల్కలకాల్వ గ్రామం వంద శాతం భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిన తొలి గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో సర్వే అనంతరం 258 సర్వే నంబర్లకుగాను 38 సర్వే నంబర్ల పరిధిలో మార్పులు చేర్పులు చేయాలని గుర్తించారు. గ్రామ పరిధిలో గతంలో ఉన్న భూ విస్తీర్ణాన్ని 1,262 ఎకరాలకు గాను 1,240 ఎకరాలుగా నిర్ధారించారు. మిగతా 22 ఎకరాలు వివాదంలో ఉండటంతో దాన్ని ఎటూ తేల్చలేదు. ఈ కొత్త పహాణీలన్నింటినీ గ్రామసభలో ప్రదర్శించి రైతులందరి ఆమోదం పొందారు. ఇదే విధంగా ప్రతి గ్రామంలోనూ గ్రామసభలు నిర్వహించి భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టనున్నారు.

రైతులకు ఎంతో మేలు
‘‘భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా పహాణీలో ఉన్న ఎంట్రీలకు, రైతులు క్లెయిమ్‌ చేసుకునే వాటికి తేడా లేకుండా ఉంటుంది. 90–95 శాతం కన్నా ఎక్కువ రికార్డులు సరి అవుతాయి. మ్యుటేషన్లు, వారసుల పేర్లు నమోదు కాకపోతే ఈ కార్యక్రమంలో నమోదు చేస్తాం. చనిపోయిన వారి, భూములు అమ్ముకున్న వారి పేర్లు తొలగిస్తాం. సర్వే నంబర్ల వారీగా పూర్తి సమాచారాన్ని విస్తీర్ణంతో సహా పోలుస్తాం. ప్రభుత్వ భూములను పక్కాగా నిర్ధారిస్తాం. తద్వారా రైతులకూ మంచే జరుగుతుంది..’’    – సుందర్‌ అబ్నార్, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌

ఎన్నో ఇబ్బందులకు ఇది పరిష్కారం
‘‘భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా వాస్తవానికి ఉన్న భూమికి, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూమికి తేడాలు సమసిపోతాయి. ప్రస్తుతం రికార్డుల్లో 30 శాతం మేర తేడాలు ఉన్నాయి. ప్రక్షాళన తర్వాత 95 శాతం వరకు భూ రికార్డులు సమగ్రమవుతాయి. పాస్‌బుక్, టైటిల్‌డీడ్‌ కోసం రైతులు రోజుల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. భూ వివాదాలు తగ్గుతాయి. అర్హులైన రైతులకే పెట్టుబడి సాయం అందుతుంది. ప్రభుత్వ ధనం వృథాకాకుండా ఉంటుంది..’’
– సి.నారాయణరెడ్డి, నల్లగొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌

ఆరు దశల్లో ప్రక్షాళన..
1 ఆన్‌లైన్‌ పహాణీల తనిఖీ
భూ రికార్డుల ప్రక్షాళన తొలి దశలో.. గ్రామాల్లోని సర్వే నం బర్ల వారీగా పహాణీలను పరిశీలిస్తారు. ఆ సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉంది.. సేత్వార్‌ లేదా ఖాస్రా, చెస్సలా పహాణీల్లోని భూ విస్తీర్ణంతో సరిపోతుందా లేదా పరిశీలిస్తారు. రికార్డుల్లో ఉన్న మేరకు ఆ భూమి స్వభావాన్ని కూడా సరిచూస్తారు. పట్టాదారు, అనుభవదారులు వివరాలు సరిపోలుతున్నాయా లేవా చూస్తారు. దీనికి అనుగుణంగా సాగుకు పనికిరాని, పనికి వచ్చే భూ విస్తీర్ణంలో మార్పులు, సర్వే నంబర్ల వారీగా విస్తీర్ణం పెరిగిందా.. తగ్గిందా..? తొలగించాల్సిన పేర్లేమైనా ఉన్నాయా? పేరు మార్పిడి.. పట్టా మార్పిడి.. కొత్త ఎంట్రీలు.. కొన్న వారి పేర్లు నమోదు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తారు.

2 ఆన్‌లైన్‌ 1బీ పరిశీలన
ఆన్‌లైన్‌ పహాణీలో సర్వే నంబర్ల వారీ వివరా లుంటే.. 1బీలో రైతుల వారీ వివరాలుంటాయి. అంటే ఒక రైతుకు ఎన్ని సర్వే నంబర్లలో భూమి ఉన్నా ఒకే చోట అందుబాటులో ఉండే రికార్డును 1బీ అంటారు. ఈ రికార్డు పరిశీ లనలో భాగంగా అక్షర దోషాలు, పాస్‌ పుస్తకాల్లో తేడాలు, పట్టాదారు వివరాల్లో తేడాలు, అమ్మకం జరిగిన భూముల వివరాలు, డబుల్‌ ఖాతాల వివరాలను పరిశీలిస్తారు. రైతుల పట్టా పాస్‌ పుస్తకాల ఆధారంగా జరిగే ఈ పరిశీలన అనంతరం.. మార్పు చేర్పులను రైతులకు చూపించి, ప్రతి రైతు నుంచి సంతకం కూడా తీసుకుంటారు.

3 గ్రామ రిజిస్టర్‌ తయారీ
ఆన్‌లైన్‌ పహాణీ, 1బీ రికార్డుల పరిశీలన తర్వాత గ్రామం యూనిట్‌గా రిజిస్టర్‌ తయారు చేస్తారు. ఇందులో సేత్వార్, ఖాస్రా, చెస్సలా పహాణీల ప్రకారం ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి ఉంది.. ప్రస్తుత పహాణీలో ఎంత భూమి ఉంది.. తదితర వివరాలను నమోదు చేస్తారు. సర్వే నంబర్ల వారీగా భూ విస్తీర్ణంలో తక్కువ, ఎక్కువలుంటే వాటిని నమోదు చేస్తారు. ఇనాం పట్టాభూములు, ప్రభుత్వ, సీలింగ్, దేవాదాయ, వక్ఫ్, భూదాన భూముల వివరాలను కూడా ఈ రిజిస్టర్లలో సర్వే నంబర్ల వారీగా పొందుపరుస్తారు.

4 మార్పులపై తహసీల్దార్‌ ఉత్తర్వులు
భూ రికార్డుల ప్రక్షాళనలో తొలి మూడు దశలు పరిశీలనకు సంబంధించినవికాగా.. నాలుగో దశ మాత్రం మార్పులు చేపట్టేది. ఈ దశలోనే క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది గుర్తించిన తప్పు ఒప్పులు, మార్పులు చేర్పుల ఆధారంగా.. రెవెన్యూ రికార్డులను మార్చడానికి తహసీల్దార్లు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులపై గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)తో పాటు తహసీల్దార్‌ కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. అసైన్‌దారులు, పట్టాభూముల తొలగింపులు, పట్టాదారు పేరు సవరణ, అనుభవదారు పేరు సవరణ, విస్తీర్ణం, ఖాతా నంబర్లు, భూ వర్గీకరణలో సవరణలను అధికారికం చేస్తారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో చేర్చాల్సిన పట్టాదారుల జాబితాను కూడా తయారు చేస్తారు.

5 మాన్యువల్‌ పహాణీల తయారీ
ఐదో దశలో కొత్త రికార్డుల తయారీ ప్రక్రియను చేపడతారు. మాన్యువల్‌ రికార్డులను తహసీల్దార్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచేం దుకు వీలుగా రూపొందిస్తున్నారు. ఇందులో ఆన్‌లైన్‌ పహాణీ, 1బీ రికార్డుల్లో గుర్తించిన సవరణలు, గ్రామ రిజిస్టర్‌లో పొందుపరచిన ప్రతిపాదనల ఆధారంగా ఇచ్చిన తహసీల్దార్‌ ఉత్తర్వుల మేరకు వివరాలను నమోదు చేస్తారు. ప్రస్తుతానికి గతంలో ఉన్న పహాణీలో ఉన్న కాలమ్‌లన్నింటినీ భర్తీ చేస్తున్నారు. కాలమ్‌ల సవరణపై అధికారిక నిర్ణయం వచ్చిన తర్వాత ఆ మేరకు నమోదు చేస్తారు.

6 ఆన్‌లైన్‌ పహాణీల తయారీ
రికార్డుల ప్రక్షాళనలో చివరిదైన ఆరో దశలో కొత్త భూ రికార్డులన్నింటినీ పూర్తిగా కంప్యూటరైజ్డ్‌ చేస్తారు.ఈ వివరాలే ఎకరానికి  ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి సాయం పథకానికి కీలకం కానున్నాయి.అన్ని రకాల పరిశీలనల అనంతరం మాన్యువల్‌ పహాణీలో పేర్కొన్న వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో.. భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ పూర్తవుతుంది.

మరిన్ని వార్తలు