చార్మినార్‌కు స్కానింగ్‌

6 May, 2019 03:56 IST|Sakshi

పెచ్చు ఊడిన చోట సూక్ష్మ పగుళ్లున్నట్టు తేల్చిన అధికారులు

మిగతాచోట్ల గుర్తించేందుకు థెర్మోగ్రఫీ పరికరంతో పరీక్షించాలని నిర్ణయం

పగుళ్లుంటే వాననీటిని సులభంగా పీల్చుకోనున్న డంగు సున్నం

అలా పీల్చి బరువెక్కి కొంతభాగం కట్టడం నుంచి పడిపోయిందని నిర్ధారణ  

సాక్షి, హైదరాబాద్‌: చారిత్రక చార్మినార్‌కు భారీగా సూక్ష్మపగుళ్లు.. పై‘పెచ్చు’నిర్లక్ష్యం.. వెరసి కాలుష్యం బారి నుంచి ఆ కట్టడానికి రక్షణ కరువైంది. నాలుగు రోజులక్రితం మక్కా మసీదు వైపు ఉన్న మినార్‌ నుంచి పెద్ద పెచ్చు ఊడి పడేందుకు భారీగా ఏర్పడ్డ సూక్ష్మపగుళ్లే కారణమని నిపుణులు నిర్ధారించారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు సూక్ష్మపగుళ్ల నుంచి నీళ్లు లోనికి చేరి ఆ భాగం ఒక్కసారిగా బరువెక్కి కట్టడం నుంచి ఊడిపోయిందని ప్రాథమికంగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం(ఏఎస్‌ఐ) నిపుణులు గుర్తించారు.

మరికొద్ది రోజుల్లో వానాకాలం మొదలవుతున్నందున, కట్టడం మిగతా ప్రాంతాల్లో పగుళ్లుంటే వాననీళ్లు లోనికి చేరి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆ పగుళ్ల తీవ్రతను గుర్తించేందుకు చార్మినార్‌ను ఇన్‌ఫ్రారెడ్‌ థెర్మోగ్రఫీ పరికరంతో అణువణువూ స్కాన్‌ చేయాలని ఏఎస్‌ఐ నిర్ణయించింది. తొలిసారి టాప్‌ టూ బాటమ్‌ స్కాన్‌ చేసి చార్మినార్‌పై ఉన్న పగుళ్లను గుర్తించి వెంటనే మరమ్మతు చేయాలని నిర్ణయించారు.  

థెర్మోగ్రఫీతో పగుళ్ల జాడలు...
ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల వయసున్న కట్టడాలకు థెర్మోగ్రఫీ యంత్రంతో స్కాన్‌ చేసి ముందస్తుగా ప్రమాదాన్ని పసిగట్టి ధ్వంసం కాకుండా జాగ్రత్తపడుతున్నారు. మనదేశంలో కేవలం తాజ్‌మహల్‌ లాంటి కొన్ని కట్టడాలకే దాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటివరకు చార్మినార్‌ను దానితో స్కాన్‌ చేయలేదు. వాతావరణ ప్రభావంతో పెద్ద పెచ్చులూడి కిందపడ్డ నేపథ్యంలో ఇక అలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయని, ఇది క్రమంగా కట్టడం ప్రధాన నిర్మాణానికి కూడా ప్రమాదకరంగా మారుతుందని అధికారులంటున్నారు.

పెచ్చు ఊడిపడ్డ తర్వాత ఏఎస్‌ఐ జాయింట్‌ డైరక్టర్‌ (కన్జర్వేషన్‌) జాన్‌విజ్‌ శర్మ వచ్చి కట్టడాన్ని పరిశీలించారు. పెచ్చు ఊడిపడ్డ ప్రాంతంలో కెమెరాతో ఫొటోలు తీసి పరిశీలించారు. మినార్‌పై గోటితో గట్టిగా గిల్లితే సున్నం ఊడొస్తుందని గుర్తించారు. అదే దిగువ భాగంగా గోటితో ఎంత గట్టిగా గిల్లినా సున్నం రాలటం లేదు. దీంతో పైభాగానికి వెంటనే ప్రత్యేక చర్యలు అవసరమని ఆయన తేల్చి మొత్తం కట్టడాన్ని ఇన్‌ఫ్రారెడ్‌ థెర్మోగ్రఫీతో స్కాన్‌ చేయాలని సిఫారసు చేశారు. ఆ పరికరాన్ని ఢిల్లీ నుంచి తెప్పించి వానాకాలం వచ్చే లోపు స్కాన్‌ చేసి అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతు చేయాలని నిర్ణయించారు.  

పైభాగం ప్రమాదకరం...
చార్మినార్‌ ప్రధాన కట్టడం రాతితో నిర్మించారు. దానిపై 40 సెంటీమీటర్ల మందంతో డంగు సున్నం, కరక్కాయ, రాతిపొడి, నల్లబెల్లం, గుడ్డు సొన తదితర పదార్థాల మిశ్రమంతో పూతపూసి నగిషీలద్దారు. దీనిపై మళ్లీ ప్రత్యేక పూత ఉంటుంది. అది నీటిని పీల్చకుండా కోట్‌ లాగా ఉపయోగపడుతుంది. చార్మినార్‌ చుట్టూ కొన్ని దశాబ్దాలుగా వాహనాలు అతి చేరువగా తిరుగుతూ ఆ ప్రాంతంలో విపరీతమైన కలుషితాలను నింపేశాయి. దీంతోపాటు వాతావరణంలో పేరుకుపోయిన ధూళి కణాలు కట్టడంపై తేమతో కలిసి క్రమంగా సన్నటి పొరలాగా పేరుకున్నాయి. వాటి వల్లే కట్టడం పైభాగం లేత గోధుమరంగులోకి మారింది. ఇది కట్టడానికి రక్షణగా ఉన్న పైపూతను క్రమంగా ధ్వంసం చేస్తూ వచ్చింది. వాతావరణానికి ఎక్కువగా ప్రభావితమయ్యే చార్మినార్‌ పైభాగంలో ఈ నష్టం ఎక్కువగా ఉందని తాజాగా గుర్తించారు.

వాహనాలు, సమీపంలో భారీ యంత్రాలతో పని తదితరాల వల్ల వచ్చిన తరంగాలు అక్కడ పగుళ్లకు కారణమయ్యాయని ప్రాథమికంగా తేల్చారు. పైపూత తొలగి సన్నటి పగుళ్లేర్పడటంతో తేమను అతి సులభంగా డంగు సున్నం పీల్చుకుంది. వాన నీటిని ఎక్కువగా పీల్చుకుని ఆ భాగం రెండింతల బరువెక్కింది. మినార్‌లకు భారీ నగిషీలు కనిపిస్తాయి. ఆ భాగంలో సున్నం బరువెక్కి కట్టడం నుంచి విడిపోయి తాజాగా కిందపడిందని గుర్తించారు. ఇప్పుడు ఈ ప్రమాదం ఇంకా ఎక్కడెక్కడ పొంచి ఉందనే విషయాన్ని వెంటనే గుర్తించాల్సి ఉంది. వర్షాకాలం ముగిసేవరకు చార్మినార్‌ చేరువలో భారీ యంత్రాలతో పనులు చేయించకుండా చూడాలని అధికారులు నిర్ణయించి విషయాన్ని జీహెచ్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లారు.  

>
మరిన్ని వార్తలు