సమయంలేదు నేతలు..నేడే చివరి గడువు

19 Nov, 2018 09:24 IST|Sakshi

సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్ల స్వీకరణ

జిల్లాలో ఇప్పటి వరకు దాఖలు చేసింది 17 మంది.. 

సాక్షి, భూపాలపల్లి అర్బన్‌: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు సమర్పిం చేందుకు సోమవారం ఒక్క రోజే మిగిలి ఉంది. సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గల్లో ఇప్పటి వరకు ఆరు రోజుల్లో 17 నామినేషన్లు వచ్చాయి. ఒకే రోజు మిగిలి ఉండటంతో ప్రధాన, ఇతర పార్టీల నాయకులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖాలు చేయడానికి సిద్ధమయ్యారు. 

ఇప్పటి వరకు..
భూపాలపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 8 మంది నాయకులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి తరఫున సతీమణి గండ్ర జ్యోతి, గులాం అప్జల్, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు, ఇండిపెండెట్లుగా కౌటం రవీందర్, పట్టెం మల్లికా ర్జున్, సిరిపెల్లి రాజయ్య నామినేషన్‌ వేశారు. ములుగు నియోజకవర్గంలో 9 మంది నామినేష న్లు వేశారు. అందులో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా అజ్మీరా చందులాల్, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సీతక్క తరఫున ఆమె బంధువులు రెండు సెట్లు, టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత పొరిక గోవింద్‌నాయక్, సీపీఐ(ఎంఎల్‌) నుంచి బూర్క చిన్న వెంకటయ్య, పూనెం మురళీక్రిష్ణ, విజయ్‌కుమార్, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌)  అభ్యర్థిగా తవిటి నారా యణ, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా కుడుముల చొక్కయ్య నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

నేడు నామినేషన్‌ వేయనున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ..
మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం కావడంతో నామినేషన్‌ వేయలేదు. అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ములుగు అభ్యర్థిగా సీతక్క, భూపాలపల్లి అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డిలకు అధిష్టానం మూడు రోజుల క్రితం బీఫారాలు అందజేసింది. వారు సోమవారం నామినేషన్‌ వేయనున్నారు. అలాగే బీఎల్‌ఎఫ్, వివిధ పార్టీల నాయకులు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు సైతం నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. 
   

మరిన్ని వార్తలు