అలరించిన ఆవిష్కరణలు

3 Nov, 2019 02:01 IST|Sakshi

‘నిట్‌’లో రెండో రోజు సాంకేతిక సంబురం

నేటితో ముగియనున్నటెక్నోజియాన్‌–19

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో విద్యార్థులు నిర్వహిస్తున్న సాంకేతిక సంబురం టెక్నోజియాన్‌–19 నోవస్‌లో శనివారం రెండో రోజూ ఆవిష్కరణ లు ఆకట్టుకున్నాయి. 14 వర్క్‌షాప్‌లు, 7 గెస్ట్‌ లెక్చర్లు, 55 ఈవెంట్లు, 6 అట్రాక్షన్లు, 6 స్పాట్‌లైట్స్‌ నిర్వహించారు. జహాజ్, త్రష్ట్, బాక్సింగ్‌ రోబోస్, అల్యూర్‌ లో భాగంగా విద్యార్థుల ర్యాంప్‌ వాక్, బాలీవుడ్‌ సింగర్‌ షెర్టీ సేటియా గీతామృతం అలరించాయి. రైతే రాజు అనే నానుడి నుంచి రైతే శాస్త్రవేత్త అనే స్థాయికి ఎదిగిన రైతన్న సంబంధిత ఆవిష్కరణలు అబ్బురపరిచా యి. చివరి రోజు ఆదివారం గెస్ట్‌లెక్చర్‌కు హీరో కార్తికేయ హాజరుకానున్నారు.

ఆసు యంత్రం
ఆలేరుకు చెందిన చింత కింది మల్లేశం రూపొందించిన ఆసు యంత్రాన్ని ఆలేరుకు చెందిన దామోదర్‌ ప్రదర్శించారు. మల్లేశం మగ్గంతో కులవృత్తి కొనసాగిస్తున్న సమయంలో ఆటంకాలను అధిగమించేందుకు ఈ యంత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఒక గంటలో 8 చీరలను నేసేందుకు వీలుగా ఆసు యంత్రం తోడ్పడుతుందని చెప్పారు.

స్క్రాప్‌ రిమూవర్‌ 
విజయవాడకు చెందిన అబ్దుల్‌ జలీల్‌ రూ.22 వేల ఖర్చుతో ఈ యంత్రం రూపొందించారు. స్క్రాప్‌ను వేరు చేసి అల్యూమినియం, కాపర్‌ వైర్లను తిరిగి ఉపయోగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒక గంటలో 30 నుంచి 40 కిలోల వైర్‌ను తొలగిస్తూ గాలి కాలుష్యం లేకుండా ఉపయోగపడుతుంది.

వైల్డ్‌ బోర్‌ అలారమ్‌
జగిత్యాల జిల్లా కిషన్‌రావుపేటకు చెందిన ఇంజపూరి అంజయ్య రూ.1,500 ఖర్చుతో దీన్ని రూపొందించారు. 5వ తరగతి వరకు చదువుకున్న ఆయన తన భూమిలో పంటలను అడవి పందులు నాశనం చేస్తుండగా, వాటిని తరిమికొట్టేందుకు యంత్రాన్ని కనుగొన్నాడు. యాంప్లీఫయర్‌ సాయం తో రూపొం దించిన సర్క్యూట్‌కు ఒక స్పీకర్‌ను ఏర్పాటు చేసి బోర్‌కు అనుసంధానం చేస్తే చాలు అడవి పందులను భయపెట్టే శబ్దం చేస్తుంది.

ఏటీవీ బైక్‌
నిట్‌ వరంగల్‌కు చెందిన విద్యార్థులు ఎనిమిది నెలల కాలంలో రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలు వెచ్చించి ఏటీవీ (ఆల్‌ టెరెయిన్‌ వెహికల్‌) రూపొందించారు. ఇది కొండలు, ఘాట్‌ రోడ్లపై సునాయాసంగా ప్రయాణం చేస్తుంది. 3 లీటర్ల పెట్రోల్‌ సామర్థ్యంతో రూపొందించిన ఈ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా