మగ్గాలపై..ఆఖరితరం!

26 Jan, 2018 15:32 IST|Sakshi
చేనేత మగ్గాలు నడుపుతున్న ఆఖరితరం కార్మికులు

సిరిసిల్లలో మూతపడిన చేనేత శిక్షణ కేంద్రం..

శిక్షణకు ముందుకురాని యువ‘తరం’

సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్‌:  చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్‌) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికు లు మరో పని చేతకాక.. వయసు మీద పడినా.. కళ్లు కనిపించకున్నా.. ఒళ్లు సహకరించకున్నా.. కాళ్లు, చేతులు ఆడిస్తూ.. జానెడు పొట్టకోసం బట్ట నేస్తు న్నారు. ఎంత పనిచేసినా.. తక్కువ కూలీ వస్తుంది. మీటరు  వస్త్రం నేస్తే రూ.17. దీంతో రోజంతా పని చేసినా.. రూ.100 రావడం కష్టం. మరో పని చేత కాని చేనేతను నమ్ముకున్న ఆఖరి తరం ఈ పనిలోనే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికు లంతా 60ఏళ్ల పైబడిన వారే కావడం విశేషం.  సిరిసిల్ల జిల్లాలో 175 మంది కార్మికులున్నారు.

ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్టనేస్తున్న ఇతని పేరు మామిడాల చంద్రయ్య(92). సిరిసిల్ల విద్యానగర్‌లో ఉండే చంద్రయ్య చిన్ననాటి నుంచే చేనేత మగ్గంపై బట్టనేస్తున్నాడు. ఒకప్పుడు చేనేత వస్త్రాలు తయారుచేస్తూ బాగానే బతికాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు చేతగాని పానం.. ఎముకలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడియ్యాలంటే రెక్కల్లో సత్తువ లేదు. దీంతో ఆయన పని మానేశారు. ఇప్పుడు చేనేత మగ్గాలపై బట్ట నేస్తున్న కార్మికులు పని మానేస్తే.. ఇక కొత్తగా చేనేత మగ్గాలను నడిపే వారు ఉండరు. చేనేత మగ్గాలకు ముసలితనం వచ్చింది. నేటి యువ ‘తరం’ చేనేత మగ్గాలను నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. మగ్గం మరణశయ్యపై నిలిచింది.

1990లో సిరిసిల్లలో చేనేత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నైపుణ్యం కలిగిన శిక్షకులతో యువ కార్మికులకు ఆరునెలల శిక్షణ ఇచ్చేవారు. రూ.1200 ఉపకార వేతనం ఇస్తూ ప్రోత్సహించారు. చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు లేక శిక్షణ పొందేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో సిరిసిల్లలోని శిక్షణ కేంద్రాన్ని  కరీంనగర్‌కు తరలించారు. అక్కడా ఇదే పరిస్థితి. తిరిగి 2015లో సిరిసిల్ల శివారులోని టెక్స్‌టైల్‌ పార్క్‌లోకి శిక్షణ కేంద్రాన్ని తరలించారు. మగ్గాల పరికరాలను ఓ అద్దె ఇంట్లో మూలన పడేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కేంద్రం మూలనపడింది. 17 చేనేత మగ్గాలు పనికి రాకుండా పోయాయి. 

మరిన్ని వార్తలు