మనమే లాస్ట్

29 Apr, 2014 00:52 IST|Sakshi
  • ఇంటర్ ‘ప్రథమ’ ఫలితాలు విడుదల
  • రాష్ట్రంలో జిల్లాదే చివరి స్థానం
  • జనరల్‌లో 38 శాతం.. ఒకేషనల్‌లో 33 శాతం ఉత్తీర్ణత
  • గతేడాది కంటే 8.5 శాతం తగ్గుదల
  • మే 25 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
  •   ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఏడాది మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. గతేడాది 13వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 23వ స్థానానికి దిగజారింది. గతేడాది 48 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సంవత్సరం 38 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. ఫలితాలు మెరుగ్గా రాకపోయినా కష్టపడి చదివిన విద్యార్థులు పాసైతే తమకు సంతోషమని అప్పట్లోనే పేర్కొన్న విషయం తెలిసిందే. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంతో ఫలితాల శాతం తగ్గినట్లు కనబడుతోంది. ఈ ఏడాది కూడా బాలుర కంటే బాలికలదే పైచేయిగా నిలిచారు.
     
     తగ్గిన ఉత్తీర్ణత శాతం
     జనరల్ కోర్సుల్లో 24,449 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 9,232 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 11,874 మంది పరీక్షకు హాజరు కాగా, 3,658 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 31 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 12,619 మంది పరీక్షకు హాజరు కాగా, 5,574 మంది ఉత్తీర్ణత సాధించారు. 44 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్ కోర్సుల్లో 3,349 మంది పరీక్షకు హాజరు కాగా, 1,110 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలురు 2,214 మంది పరీక్షకు హాజరు కాగా, 670 మంది ఉత్తీర్ణులయ్యారు. 30 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 1,135 మంది పరీక్షకు హాజరుకాగా, 440 మంది పాసయ్యారు. 39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే ఈ ఏడాది 8.5 శాతం తగ్గింది. ఫలితాలను గ్రేడ్‌ల రూపంలో, మార్కుల రూపంలో విడుదల చేశారు. 75 శాతంపైగా మార్కులు వచ్చిన వారికి  గ్రేడ్ ‘ఏ’, 60 నుంచి 75 శాతం మార్కులు వచ్చిన వారికి గ్రేడ్ ‘బీ’, 50 నుంచి 60 శాతం మార్కులు వచ్చిన వారికి గ్రేడ్ ‘సీ’, 35 నుంచి 50 శాతం మార్కులు వచ్చిన వారికి గ్రేడ్‌‘డీ’ కేటాయించారు.
     
     మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
     మే 25 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఆర్‌ఐవో ఫజలుల్లా తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మే 6లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. రీ కౌంటింగ్ కోసం రూ. 100, జిరాక్స్‌కాపీ కోసం రూ. 600 డీడీ తీయాల్సి ఉందన్నారు.
     
     టాపర్లు వీరే..
     ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఎంపీసీలో దీక్ష జూనియర్ కళాశాల నిర్మల్‌కు చెందిన డి.విఘ్నేశ్వర్ 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించారు. ఆదిలాబాద్ పట్టణంలోని నలంద కళాశాలకు చెందిన శ్వేతకు 461, బైపీసీలో మంచిర్యాలలోని అల్పోర్స్ జూనియర్ కళాశాలలో ఫరాసమ్రీన్‌కు 440 మార్కులకు 433 మార్కులు వచ్చాయి. ఆదిలాబాద్ పట్టణంలోని క్రిసెంట్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి ముషారఫ్ అజ్జుమంద్ 440 మార్కులకు 431 మార్కులు వచ్చాయి. ఎంఈసీలో మంచిర్యాలలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన సునీషా 500 మార్కులకుగాను, 484 మార్కులు సాధించారు.
     
     ఎనిమిదేళ్ల ఫలితాలు..

     
     సంవత్సరం    ఫలితాల శాతం
     200607    44.89
     200708    49.78
     200809    45.61
     200910    45.00
     201011    49.00
     201112    47.00
     201213    46.50
     201314    38.00
     

మరిన్ని వార్తలు