బాలిక.. బతకాలిక !

18 Sep, 2018 07:41 IST|Sakshi
చిన్నారులకు దుస్తులు అందజేస్తున్న లతా చౌదరి

అమ్మాయిల సంరక్షణే ధ్యేయంగా అడుగులు

‘సేవ్‌ ఎ గర్ల్‌’ నినాదంతో అవగాహన సదస్సులు

పేదలకు ఆసరాగా వివిధ వస్తువుల వితరణ

ప్రతి అత్తా తల్లిలా ఆలోచించాలని హితవు

ఆదర్శంగా నిలుస్తున్న నగరవాసి లతా చౌదరి

బాలికలు, మహిళలపై రోజురోజుకూ వేధింపులు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయి. సమాజంలో వీరి భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. అమ్మాయిల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌’ నినాదాన్ని తలకెత్తుకున్నారామె. బాలికల సంరక్షణకు నడుం కట్టారు.అవగాహన సదస్సులు, సోషల్‌ మీడియాలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆడవాళ్లభద్రతకు తనవంతు బాధ్యతగాముందుకెళ్తున్నారు హైదరాబాద్‌కు చెందిన బొట్ల లతా చౌదరి. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ‘ఆడపిల్లను రక్షించుకుందాం’ అనే నినాదంపై అవగాహన కల్పిస్తున్నారు. సమాజంలో వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రొజెక్టర్‌ల ద్వారా ప్రదర్శిస్తూ చైతన్యం తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారామె. ప్రతి అత్తా ఒక తల్లిలాఆలోచించాలని హితవు చెబుతున్నారు.   

హిమాయత్‌నగర్‌: కూకట్‌పల్లిలోని బాచుపల్లికి చెందిన లతా చౌదరి ‘ఉమెన్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. పలువురు మహిళలను వలంటీర్‌లుగా నియమించుకున్నారు. ‘సేవ్‌ ఎ గర్ల్‌’  నినాదంతో నగరంలోని బాచుపల్లి, నిజాంపేట్, బోరంపేట, కూకట్‌పల్లి ప్రాంతాలతో పాటు ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. రెండునెలలకోసారి ఓ ప్రాంతాన్ని ఎంచుకుని సంస్థ వలంటీర్లతో కలిసి గ్రామీణ మహిళలతో సమావేశమవుతుంటారు. ‘అసలు ఆడపిల్లలను ఆడదే చంపుతోంది’ అనే విషయాన్ని లేవనెత్తుతూ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలను ప్రొజెక్టర్‌లతో ప్రదర్శిస్తున్నారు. ప్రతి అత్తా తల్లిలా భావిస్తే సమాజంలో ఆడపిల్లకు ఎటువంటి అన్యాయం జరగదు. కలకాలం ఆడపిల్ల మనముందు కదలాడుతుందనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా అవగాహనలో కల్పిస్తుండటంతో ఎన్నో కుటుంబాల్లో మార్పు వచ్చిందని లతా చౌదరి చెబుతున్నారు.   

వారు ఆరోగ్యంగా ఉంటేనే..
‘సేవ్‌ ఎ గర్ల్‌’ క్యాంపెయిన్‌ ముగిశాక మరో ప్రాంతంలో ‘హెల్త్‌ అండ్‌ న్యూట్రిషియన్‌’ పేరుతో మరో క్యాంపెయిన్‌కు శ్రీకారం చుడుతున్నారు లతా చౌదరి. 20 ఏళ్లు దాటిన యువతులు, మహిళలతో సమావేశమవుతారు. గ్రామాల్లోని మహిళలు రక్తహీనతకు ఎందుకు గురవుతున్నారనే విషయాలను వారికి వివరిస్తుంటారు. ఆరోగ్యపరమైన అంశాలను వారికి చెబుతుంటారు.  అనంతరం ఆయా ప్రాంతాల్లో కొన్ని నిత్యావసర సరుకులు అందిస్తుంటారు. అలాగే ఇళ్లల్లో వాడి పడేసిన, అవసరం లేని వస్తువులను సేకరించి పేదలకు అందజేస్తున్నారు. ఇలా ‘దుస్తులు, పాదరక్షలు, మిక్సీలు, గ్రైండర్‌లు, ఫ్రిజ్‌లు, నిత్యావసర సరుకులు’వంటి వాటిని పేదలకు ఇస్తున్నారు లతాచౌదరి. ఈ ఏడాది సుమారు 3వేల మందికి వీటిని అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు.   

మార్పు కోసమే ఇదంతా.. 
ఇదంతా మార్పు కోసమే చేస్తున్నా. చాలావరకు ఆడపిల్లల జీవితాలు ఇంట్లోని ఆడవాళ్ల కారణంగానే నాశనమవుతున్నాయి. ఇరువురి మధ్య సఖ్యత అనేది చాలా ప్రాముఖ్యం. దీనిని వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి ఆదరణ వస్తోంది. నా వల్ల సమాజంలో కొంత మార్పు వచ్చినా చాలు.  – లతా చౌదరి, ఫౌండర్, ఉమెన్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌

సాయిబాబా ఆలయ నిర్మాణానికి కృషి..
నిజాంపేటలోని బాబా టెంపుల్‌ లైన్‌లో ఉన్న బాబా మందిరం ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది.  ఈ ప్రాంతంలో ఎందరో  కోటీశ్వరులు ఉన్నప్పటికీ ఎవరూ దీనిని పట్టించుకోలేదు. దీంతో లతా చౌదరి ‘షిరిడీ సాయి సేవా ట్రస్టు’ను ఏర్పాటు చేసి దీని ద్వారా విరాళాలు సేకరించారు. సుమారు రూ.కోటితో కొత్తగా దేవాలయాన్ని నిర్మించడంలో తన వంతు పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు