పవర్ గవర్నర్‌దే..

9 Aug, 2014 02:09 IST|Sakshi

* విశేషాధికారాలపై కేంద్రం మళ్లీ లేఖ
* ఇద్దరు పోలీస్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు
* సర్కారు నుంచి రికార్డులు తెప్పించుకునే అధికారం
 
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని పరిధిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్యమైన కేంద్ర సంస్థల రక్షణ బాధ్యతలతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజల ప్రాణాలు, ఆస్తులు, స్వేచ్ఛా పరిరక్షణ బాధ్యతలు గవర్నర్ చేతుల్లోనే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. హైదరాబాద్‌లో గవర్నర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టాలంటూ తాజాగా తెలంగాణ సర్కారుకు మరో లేఖ రాసింది.

కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ నుంచి వచ్చిన ఈ లేఖ శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందింది. విభజన చట్టంలోని సెక్షన్ 8, దాని సబ్‌సెక్షన్లకు సంబంధించి గవర్నర్‌కు ఉండే ప్రత్యేక బాధ్యతలను పేర్కొనడంతో పాటు, గవర్నర్ నిర్వర్తించే బాధ్యతలను కూడా ఈ లేఖలో వివరించారు. వీటి అమలుకు సంబంధించి పరిపాలన సజావుగా సాగడానికి మార్గదర్శకాలను కూడా కేంద్రం స్పష్టం చేసింది.
 
ఇవీ మార్గదర్శకాలు
* మంత్రి మండలి, ఏదైనా సంస్థ తీసుకునే నిర్ణయాల రికార్డులను, సమాచారాన్ని తెప్పించుకునే అధికారం గవర్నర్‌కు ఉంది.  శాంతిభద్రతల పరిరక్షణకు, భారీ నేరాల ప్రత్యేక నివేదికలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ ఎప్పటికప్పుడు గవర్నర్‌కు సమర్పించాలి. 
 

* శాంతిభద్రతల నియంత్రణ చట్టానికి అనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారులకు గవర్నర్ ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వవచ్చు.   శాంతిభద్రతలు, పరిపాలన అంశాల్లో గవర్నర్‌కు ఆయన సలహాదారులు సహకారం అందిస్తారు. వీరికి అవసరాన్ని బట్టి గవర్నర్ బాధ్యతలు అప్పగిస్తారు. 
 

* శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల భద్రత, ప్రత్యేక పరిస్థితులపై నివేదికలను రెండు కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ, తెలంగాణ హోం శాఖ కార్యదర్శి కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలి. దీనిపై గవర్నర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తారు. ఈ అంశాల్లో గవర్నర్ ఆదేశాలే అంతిమంగా అమలవుతాయి. 
 

* ఆ రెండు కమిషనరేట్లలో ఐజీ ర్యాంకుకు తగ్గని సీనియర్ అధికారులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. వీరితోపాటు రంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలోనూ ఏర్పాటు చేయాలి. 

* బలవంతపు వసూళ్లు, విద్వేషాలు రెచ్చగొట్టే నేరాలపై సత్వర విచారణ నిర్వహించాలి. కోర్టుల్లో వేగంగా విచారణ జరిగేలా చర్య తీసుకోవాలి. ఈ సెల్‌లోని అధికారుల సెల్‌ఫోన్ నంబర్లతోపాటు, చిరునామాలకు విస్తృత ప్రచారం కల్పించాలి. 
 

* అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల రక్షణకు జంట కమిషనరేట్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి వీరందరిపై సీనియర్ అధికారిని నియమించాలి. ఈ సెల్ సున్నితమైన సంస్థలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు నివేదించాలి. ప్రస్తుతం ఈ సంస్థలకు ఎస్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ ద్వారా కల్పిస్తున్న సెక్యూరిటీని సమీక్షించి, పటిష్ట భద్రతను కల్పించాలి. రక్షణ బలోపేతానికి గవర్నర్ చేసే సూచనలను విధిగా అమలు చేయాలి. ఇందుకోసం సీనియర్ అధికారిని నియమించి భద్రతా పరిస్థితిని ఎప్పటికప్పుడు గవర్నర్‌కు నివేదించాలి. 
 

* తెలంగాణ డీజీపీ హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పోలీసు సర్వీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు ద్వారానే డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓల వరకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఈ బోర్డు చేసిన ప్రతిపాదనలపై గవర్నర్ సలహాలు, సూచనలతో మార్పులు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. 
 

* అత్యవసర పరిస్థితుల్లో బలగాల మోహరింపుపై గవర్నర్ చేసే సూచనలను టీ సర్కారు పరిశీలించి మళ్లీ గవర్నర్‌కు పంపించాలి. దీనిపై గవర్నర్‌దే తుది నిర్ణయం. ఉమ్మడి రాజధాని పరిధిలో చట్టాల ఏర్పాటు, కమిషన్ల నియామకం, చట్టాల్లో సెక్షన్ల తొలగింపునకు సంబంధించిన నివేదికను చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. చట్టాల రూపకల్పన, కమిషన్ల ఏర్పాటునకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై నివేదిక కోరే అధికారం ఉంటుంది. 
 

* అవసరాన్ని బట్టి ఉద్యోగుల తాత్కాలిక పద్ధతిలో పునర్నియామకానికి ప్రభుత్వాన్ని గవర్నర్ కోరవచ్చు.  ఇరు రాష్ట్రాలకు భవనాల కేటాయింపునకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు  ప్రభుత్వం సలహాలతో గవర్నర్ నిర్వహణ సాగిస్తారు. 
 

* ఉమ్మడి రాజధానిలో నివసిస్తున్న ప్రజల ఆస్తుల రక్షణకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్లతో ఫిర్యాదుల విభాగం ఏర్పాటుచేయాలి. ఫిర్యాదుదారుల ఆస్తుల రక్షణ, హక్కులపై ప్రభుత్వ అధికారులకు గవర్నర్ అవసరమైన ఆదేశాలు జారీచేస్తారు. వాటిని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రతిని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికీ పంపారు. 

మరిన్ని వార్తలు