మార్గదర్శకాలకు విరుద్ధంగా జడ్జీల కేటాయింపు

25 May, 2016 17:00 IST|Sakshi

-న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులకు తీవ్ర అన్యాయం
-త్వరలో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం
-ఉద్యోగ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి


హైదరాబాద్: హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా న్యాయాధికారుల ప్రాథమిక (ప్రొవిజనల్) కేటాయింపులు జరిగాయని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బోద లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసే విధంగా ఉన్న ఈ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. సర్వీస్ రిజిస్ట్రర్‌లో సూచించిన స్థానికత ఆధారంగా న్యాయాధికారుల కేటాయింపులు జరగాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయాధికారులకు సంబంధించిన అన్ని క్యాడర్లలో ఖాళీలను చూపించినా...ఆ ప్రాంతానికి చెందిన అధికారులను తెలంగాణకు కేటాయించడంతో..ఇక్కడి న్యాయాధికారులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందన్నారు.

అలాగే కొత్తగా చేపట్టే నియామకాల్లో న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం వల్లనే తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, అలాగే సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు ఇచ్చే విధానాన్ని కొనసాగించాలని కోరారు. న్యాయాధికారుల కేటాయింపులపై చర్చించేందుకు త్వరలో కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేస్తామని, కేటాయింపులు రద్దు డిమాండ్‌తో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు