మార్చి 15 నుంచి లాసెట్‌ దరఖాస్తులు

20 Feb, 2019 01:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించనున్న లాసెట్‌–2019కి వచ్చే నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని లాసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన లాసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశాల షెడ్యూలును ఖరారు చేసింది. మే 20న ఉదయం 10 నుంచి 11:30 వరకు ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 10న జారీ చేయనుంది. సిలబస్, అర్హతలు, ప్రాంతీయ కేంద్రాలపై చర్చించింది. ఎల్‌ఎల్‌బీ పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.800గా నిర్ణయించింది.

పీజీ లా పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.800, ఇతరులకు రూ.1,000గా నిర్ణయించింది. వివరాలను  https://lawcet.tsche.ac.in లో పొందవచ్చని వివరించింది. సమావేశంలో ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రం, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, మండలి కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు, లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీబీరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు