రోడ్ల విస్తరణ చేపట్టట్లేదు..

30 Oct, 2018 02:06 IST|Sakshi

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవట్లేదు 

పాదచారులు రోడ్లు దాటడం కష్టంగా మారింది 

హైకోర్టుకు న్యాయవాది రాపోలు భాస్కర్‌ లేఖ 

పిల్‌గా పరిగణించిన హైకోర్టు 

పార్కింగ్‌ ఏరియాలో షాపుల వల్లే సమస్య: జస్టిస్‌ కోదండరామ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను విస్తరించట్లేదని, రోడ్డు ప్రమాదాలను నివారించే విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ లేఖను పిల్‌ కమిటీ సిఫారసుల మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా పరిగణించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు, ట్రాఫిక్‌ డీసీపీలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య వల్ల సగం రోజు రోడ్లపైనే గడిచిపోతోందని భాస్కర్‌ తన లేఖలో పేర్కొన్నారు. తగిన స్థాయిలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు నిర్మించలేదని, దీంతో పాదచారులు రోడ్డు దాటడం కష్టమవుతోందన్నారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటం వల్ల వాహనాలను కూడా రోడ్లపై నిలుపుతున్నారని, ఇది కూడా ట్రాఫిక్‌ సమస్యకు ప్రధాన కారణంగా మారిందని వివరించారు. ఈ ట్రాఫిక్‌ నుంచి తప్పించుకుని వాహనదారులు త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, దీంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లకు, మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు నిర్వహించే విషయంలో ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండట్లేదన్నారు. ఆర్టీసీ బస్సులను కూడా రోడ్ల మధ్యలో అకస్మాత్తుగా ఆపుతున్నారని, వీటి వల్ల వెనుక వచ్చే వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని, కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పారు. 

పార్కింగ్‌ ప్రదేశంలో షాపులు.. 
పిల్‌ కమిటీలోని న్యాయమూర్తులందరూ కూడా ఈ లేఖను పిల్‌గా పరిగణించాలని ఏకగ్రీవంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ సమయంలో స్టిల్ట్‌ ఏరియాను పార్కింగ్‌ కోసం చూపుతున్నా, ఆ తర్వాత దాన్ని వాణిజ్య అవసరాల కోసం దుకాణాలుగా మారుస్తున్నారని కమిటీ లోని న్యాయమూర్తి జస్టిస్‌ కోదండరామ్‌ అభిప్రాయపడ్డారు. దీంతో వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలను నిలపాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఈ అభిప్రాయంతో న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ ఏకీభవించారు.

మరిన్ని వార్తలు