రాసి పెట్టుకోండి..!

26 Sep, 2018 08:47 IST|Sakshi
ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  ‘ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయం. ఈ రోజు నేను అంటున్నానని కాదు.. ఈ మాట రాసి పెట్టుకోండి.. పాలమూరు ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ విజయ దుదుంభి మోగిస్తుంది. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరును వెనకబడిన ప్రాంతంగానే ఉంచారు. టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవన్నీ నెరవేరి పాలమూరు ప్రజల తలరాత మారాలంటే మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవడం చారిత్రక అవసరం. ప్రజలు కూడా ఇంకోసారి టీఆర్‌ఎస్, కేసీఆర్‌ను ఆశీర్వదించడం ఖాయం’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అంశాలు ప్రభావితం చూపుతాయి, ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పరిస్థితి, విపక్షాల విమర్శలు, అసంతృప్తి నేతల వేరు కుంపట్లు తదితర అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

వారిది అసమర్థ నాయకత్వం 
పాలమూరు ప్రాంతం అంటే కరువు, కాటకాలతో సతమతమయ్యేదనే ముద్ర పడింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వెనకబడిన ప్రాంతాల్లో పాలమూరు ఒకటి. ఇలా కావడానికి గత పాలకులే కారణం. ఎందుకంటే పాలమూరులో పుష్కలమైన వనరులు ఉన్నాయి. తలాఫున కృష్ణమ్మ పారుతున్నా... సాగు, తాగునీరు అందించలేని అసమర్థ నాయకత్వం గత పాలకులది.60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని అభివృద్ధిని... టీఆర్‌ఎస్‌ కేవలం నాలుగున్నర ఏళ్లలో చేసి చూపించింది.
 
సమస్యలు అధిగమిస్తున్నాం.. 
విపక్షనేతలకు ఎంతసేపు రాజకీయం చేయాలనే ధ్యాసే తప్ప అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఆలోచన లేదు. ఉదాహరణకు ఒక విషయం చెబుతా... పాల మూరులో తీవ్ర వర్షాభావంవల్ల అశించినంతగా సాగు జరగడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన పాలమూరు–రంగారెడ్డిని ప్రారంభించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చినప్పు డు ఏం చేయాలి? రాజకీయాలకు అతీతంగా అం దరూ కలిసి మెలిసి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలి. కానీ ప్రతిపక్షాల నాయకులు ప్రతీ చిన్న విషయానికి కోర్టుల్లో కేసులు వేశారు. ఫలితంగా మూడు, నాలుగేళ్లలో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి. అయితే వారు ఎన్ని చిక్కులు సృష్టిస్తున్నా... సీఎం కేసీఆర్‌ చాకచక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తున్నారు.  
మాటలతో మభ్యపెట్టారు.

కాంగ్రెస్‌ నేతలకు మాటలు తప్ప మరేం చేతకాదు. ప్రాజెక్టులను వాళ్లు 90శాతం పూర్తి చేసినట్లయితే.. పది శాతం పనులే అడ్డంకయ్యాయా? 60 ఏళ్లుగా వాళ్లు ఇలాంటి మోసపూరిత మాటలతోనే మభ్యపెట్టారు. అభివృద్ధి విషయంలో వాళ్లు కళ్లు ఉండి కబోదులు. ఈ రోజు నాగర్‌కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, మక్తల్, దేవ రకద్ర, అలంపూర్, గద్వాల నియోజకవర్గాలకు వెళ్లి చూడమనండి. సాగునీరుతో ఆ ప్రాంత మంతా కోనసీమ మాదిరిగా పచ్చదనంతో కళకళలాడుతోంది. మేం కాదు స్థానిక ప్రజలే చెబుతారు టీఆర్‌ఎస్‌ ఏం చేసిందనేది.
 
ఉత్తుత్తి ప్రచారమే.. 
పాలమూరు టీఆర్‌ఎస్‌ బలహీనంగా ఉందనేది ఉత్తి ప్రచారం మాత్రమే. ప్రస్తుతం పాలమూరు ప్రాంతంలో టీఆర్‌ఎస్‌కు.. కాంగ్రెస్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక్క విషయం చెప్పాలంటే ... పాలమూరులో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి. ఆ పార్టీ అభ్యర్థులకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో విపక్షాలు ఒకటి, రెండు స్థానాలు గెలిస్తే గగనమే. టీఆర్‌ఎస్‌ స్వీప్‌ చేయడం ఖాయం.
 
ఓర్వలేక ఒకటయ్యారు.. 
టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఒక్కటవుతున్నారు. వారికి జెండా లేదు అజెండా లేదు. వారి చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. విపక్షాలన్నీ వంద మందితో కలిసి వచ్చినా... టీఆర్‌ఎస్‌ సింహం సింగిల్‌గా ఎదుర్కొంటుంది. ఈ ఎన్నికలు మహాభారతంలో కౌరవ, పాండవుల యుద్ధం లాంటిది. అంతిమంగా న్యాయమే గెలిచి తీరుతుంది. 

అసంతృప్తి సహజం 
ఏ రాజకీయపార్టీలోనైన కాస్త అసంతృప్తి సహ జమే. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు కదా. అంతెందుకు చేతికి ఉండే ఐదు వేళ్లు ఒకలా ఉండవు. పార్టీలో ఉండే వ్యక్తలు అందరూ ఒకలా ఆలోచించాలనేది గ్యారంటీ ఉండదు. కనుక ఒకటి, రెండు చోట్ల అభ్యర్థుల విషయంలో అసంతృప్తి సహజంగాగా బయట పడుతోంది. ఇప్పటికే అసంతృప్తులతో సంప్రదింపులు చేశాము. అన్ని కూడా ఒకట్రెండు రోజుల్లో ఓ కొలిక్కి వస్తాయి.

అందరూ పార్టీకి పనిచేస్తారు 
ప్రస్తుతం కొందరు అభ్యర్థులపై ఉన్న అసంతృప్తి టీ కప్పులో తుఫాను వంటిది. దీనిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో మార్పు ఉండదు. ఇది ఫైనల్‌ అని ఇదివరకే పార్టీ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇక్కడ మరో ప్రశ్నకు తావే లేదు. ప్రకటించిన అభ్యర్థులే బరిలో ఉంటారు. అసంతృప్తి కూడా సద్గుమణుగుతుంది. ఆ తర్వాత అందరు కూడా పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తారు.  

కనీవినీ రీతిలో అభివృద్ధి 
జడ్చర్ల నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా కనివినీ ఎరుగని విధంగా అభివృద్ధి పథంలో నడుస్తోంది. నియోజకవర్గంలోని గ్రామాలన్నింటికీ బీటీ రోడ్లు వేశాం. నియోజకవర్గ కేంద్రంలో డివైడర్‌తో కూడిన రెండు లేన్ల రహదారి నిర్మించాం. తాగునీటికి ఎంతో ఇబ్బంది ఉండే బాదేపల్లి, జడ్చర్ల పట్టణాలకు మిషన్‌ భగీరథ ద్వారా నీరు ఇస్తున్నాం. అంతేకాదు నా హయాంలోనే జడ్చర్లకు పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటై అభివృద్ధి చెందింది. జడ్చర్ల నుంచి గతంలో ఎందరో ప్రాతినిధ్యం వహించినా ఎవరు కూడా నేను చేసినంత అభివృద్ధి చేయలేదు.  

ఆస్పత్రులన్నీ బలోపేతం చేశా.. 
వైద్య ఆరోగ్యశాఖ నాదే కావడంతో ఒక్క నా నియోజకవర్గమే కాదు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులన్నీ బలోపేతం చేశాను. జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి జిల్లా ఆస్పత్రిని అత్యంత వెనకబడిన నారాయణపేటకు కేటాయించాల్సి వచ్చింది. అందుకే నా నియోజకవర్గమైన జడ్చర్లలోని అన్ని పీహెచ్‌సీలను 30 పడకల ఆస్పత్రులుగా మారుస్తానని చెప్పా ను. అందుకు అనుగుణంగా బాలానగర్‌లోని పీహెచ్‌సీ 30 పడకలు పనులు పూర్తయ్యా యి. నవాబుపేట, మిడ్జిల్‌లో పనులు చురు గ్గా సాగుతున్నాయి. ఒక రాజాపూర్‌లో మా త్రమే అవసరం లేదని చేపట్టడంలేదు. ఎం దుకంటే రాజాపూర్‌ మండలం అటు బాలానగర్, ఇటు జడ్చర్లకు అతి చేరువలో ఉంది. జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రిని కూడా ఎన్నికల నాటికి పూర్తి చేస్తాం. ఇక ఫైర్‌స్టేషన్‌కు సంబంధించి పనులు కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు సాధించగా.. స్థలసేకరణ కూడా పూర్తయ్యింది. అది సాధ్యమైనంత త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా