మూసీ నదిని సబర్మతిలా శుద్ధి చేస్తామని ప్రగల్భాలు

16 Dec, 2019 13:37 IST|Sakshi
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్: మూసీనదిని ప్రక్షాళన చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ముఖ్యమంత్రి‌ కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ విమర్శించారు. సోమవారం ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన  మాట్లాడుతూ.. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ సైతం.. మూసీ నదిని సబర్మతి నదిలా శుద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతారే తప్ప, ఆచరణలో కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించరని ఎద్దేవా చేశారు. హైద్రాబాద్‌కు మంచి నీరందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను కబ్జాలను అడ్డుకోవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.  ఇక హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రూ. 3వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 3రూపాయలు కూడా ఖర్చు చేయలేదంటూ ఆరోపించారు. 2001లో అప్పటి వాజపేయి ప్రభుత్వం నదుల ప్రక్షాళనకు నిధులను కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టించాయని పేర్కొన్నారు. బాపు ఘాట్ దగ్గర కూడా మూసీ దుర్గంధంగా మారటం బాధాకరమన్నారు.

తాగు, సాగునీరు అందించే మూసీ దుర్గంధంగా మారడంతో పాటు నది పరివాహక ప్రాంతంలో పండిన కూరగాయలు సైతం విషతుల్యం అవుతున్నాయని లక్ష్మణ్‌ మండిపడ్డారు. హైద్రాబాద్‌ను విశ్వనగరంగా మార్చుతామని‌‌.‌.‌ చివరకు విషాద నగరంగా మార్చారంటూ దుయ్యబట్టారు. ముడుపులు తీసుకుని పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌లో వదలడంతో డ్రైనేజీ నీరు కలిసి కంపుగా మారిందని తెలిపారు. హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీరుగా మారుస్తామన్న కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయని, సీఎం కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు.

చదవండి: (మూసీపై ప్రభుత్వం ప్రగల్భాలు)

మరిన్ని వార్తలు