అసమానతలున్నంత వరకు రిజర్వేషన్లు

22 Jan, 2020 02:00 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను సవరించి మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీజేపీయేనని వాఖ్యానించారు. మంగళవారం రవీంద్రభారతిలో జాతీయ ఎస్సీ కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్‌ సెమినార్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాలసీ అండ్‌ ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్స్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రతి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంలో బీజేపీ ముందుంటుందని, దేశానికి రాష్ట్రపతిగా తొలిసారి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని అప్పటి ప్రధాని వాజ్‌పేయి నిలిపారని గుర్తుచేశారు. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారని, దళిత వ్యక్తిని రాష్ట్రపతిగా చేసింది కూడా బీజేపీ అని తెలిపారు. సమాజంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత కఠినతరం చేసినట్లు చెప్పారు.

దళితుల రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించి ప్రధాని మోదీ సాహసం చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ దళితులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్యానిధి లాంటి పథాకాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అట్రాసిటీ కేసులు పెరుగుతున్నాయని, కానీ పోలీసులు నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇస్తూ వారికి పరోక్షంగా సహకరిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములు అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు