సంస్కృతి, చరిత్రకు ప్రతిరూపమే అధికారిక చిహ్నం

1 Jun, 2014 15:40 IST|Sakshi
సంస్కృతి, చరిత్రకు ప్రతిరూపమే అధికారిక చిహ్నం

భువనగిరి: సంస్కృతి, చరిత్ర, పాడిపంటలతో కూడిన బంగారు తెలంగాణకు ప్రతిరూపంగా అధికారిక చిహ్నం రూపొందించినట్టు ప్రఖ్యాత కుంచె చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ తెలిపారు. నల్లగొండ జిల్లా ఆత్మకూర్.ఎం మండలం కదిరేనిగూడెం గ్రామానికి చెందిన ఏలె లక్ష్మణ్ రూపొందించిన లోగోను తెలంగాణ అధికారిక చిహ్నంగా ప్రభుత్వం ఆమోదించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో  మాట్లాడారు. తెలంగాణ అధికారిక చిహ్నం ప్రాముఖ్యతను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

తెలంగాణ అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది కాకతీయుల పరిపాలన.. వారి శిలాతోరణం... 11, 12 శతాబ్దాల  నాటి  సంస్కృతి,  చరిత్రకు తోరణం అద్దం పడుతుంది. అలాగే, హైదరాబాద్‌లోని చార్మినార్. 423 ఏళ్ల చరిత్రతోపాటు అనేక భిన్న సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్ నగరానికి ఉంది.  అద్భుత కట్టడం  చార్మినార్ లేని హైదరాబాద్‌ను, హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించలేం. ఈ రెండు అంశాలు  మన సంస్కృతికి, చరిత్రకు అద్దం పడతాయి. వాటికి ప్రతిరూపంగా కాకతీయ తోరణం, చార్మినార్‌ను లోగోలో పొందుపర్చాను.

అదే విధంగా భారత ప్రభుత్వం అధికారిక చిహ్నం నాలుగు సింహాల రాజముద్రను పెట్టాను. తెలంగాణ రాష్ర్టం పాడిపంటలతో తులతూగాలని ఆకుపచ్చ రంగును ఎంచుకున్నా. చుట్టూ ఉన్న బంగారం రంగు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే బంగారు తెలంగాణకు ప్రతిరూపం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించగానే అధికారిక చిహ్నం రూపొందించాలనే ఆలోచన వచ్చింది. పలు అంశాలను చేర్చడం వల్ల అందులో స్పష్టత ఉండదని భావించి, ప్రధానమైన రెండు అంశాలను మాత్రమే చేర్చాను. పది రోజుల్లోనే పూర్తి చేయగలిగాను. 

పూర్ణకుంభం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్  రాష్ర్ట అధికారిక చిహ్నంగా ఉంది. అందుకే దానిని తీసుకోలేదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది.. కేసీఆర్ మనసులో ఉన్న విధంగా లోగోను తయారు చేయగలిగాను.  నేను రూపొందించిన చిహ్నం సులభంగా అందరికీ అర్థం కావడం నా ఆశయం. అది నెరవేరినందుకు సంతోషంగా ఉంది.

మరిన్ని వార్తలు