‘బాహుబలి’ రన్‌ విజయవంతం

21 Jul, 2018 01:23 IST|Sakshi

నేడు కాళేశ్వరం ప్యాకేజీ–8లో మరో పంపు డ్రై రన్‌

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్‌ పంపుల డ్రై రన్‌ ప్రక్రియ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్‌ స్టేషన్‌ అయిన ప్యాకేజీ–8లోని 5వ మోటార్‌ డ్రై రన్‌ శుక్రవారం నిర్వహించగా అది విజయవంతమైంది. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ విజయవంతం చేసిన మేఘ ఇంజనీరింగ్‌ సంస్థ శుక్రవారం స్పీడ్‌ ట్రయల్‌రన్, డ్రై రన్‌ను చేపట్టి విజయవంతంగా, నిరంతరాయంగా కొనసాగిస్తోందని ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు.

మోటార్‌ స్పీడ్‌ క్రమంగా పెంచుతూ పూర్తి స్థాయిలో పనిచేసేలా ఈ స్పీడ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. మోటార్‌ ఆర్‌పీఎం (రివల్యూషన్‌ పర్‌ మినిట్‌) సామ ర్థ్యం 214.5 ఆర్‌పీఎంలు కాగా శుక్రవారం ఉదయా నికి మోటార్‌ 170 ఆర్‌పీఎంలకు చేరుకుందని అధికారులు తెలిపారు. మేఘ ఇంజనీరింగ్, బీహెచ్‌ఈఎల్, జర్మనీకి చెందిన సీమన్‌ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ట్రయల్‌రన్‌ కొనసాగుతోంద ని వెల్లడించారు. శనివారం నుంచి నాలుగో మోటార్‌ స్పీడ్‌ ట్రయల్‌రన్, డ్రై రన్‌ ప్రారంభం అవుతుందని, ఆదివారం నాటికి రెండు మోటార్లు పూర్తి స్థాయిలో సిద్ధమవుతాయని ప్రకటించారు.

ఈ ట్రయల్‌ రన్‌ను ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ వెంకట రాములు, ఈఈ శ్రీధర్, సీమెన్స్‌ ఇండియా నుంచి సందీప్, భెల్‌ నుంచి అనిల్‌ కుమార్‌ పురే (భోపాల్‌), శరవణన్‌ (బెంగళూరు), సుమిత్‌ సచ్‌ దేవ్‌ (ఢిల్లీ), మేఘా ఇంజనీరింగ్‌ ప్రతినిధులు పర్యవేక్షించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు వచ్చిన వెంటనే పంపింగ్‌ చేసేందుకు ఈ మోటార్ల డ్రై రన్, స్పీడ్‌ ట్రయల్‌ రన్‌ పూర్తి చేశారు.

వర్షాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు ఆలస్యమైనా ఎల్లంపల్లికి చేరుతున్న నీటిని ఎత్తిపోసేలా ఈ మోటా ర్లు సిద్ధం చేస్తున్నారు. 20 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లిలో ఇప్పటికే 12.58 టీఎంసీలు నిల్వలుండ గా, ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఆగస్టు నుంచి కాళేశ్వరంలోని ప్యాకేజీ–6 మోటార్ల ద్వారా మేడారం రిజర్వాయర్‌కు, అటు నుంచి ప్యాకేజీ–7 టన్నెల్, గ్రావిటీ కెనాల్‌ ప్యాకేజీ–8లోని రెండు మోటార్ల ద్వారా మిడ్‌ మానేరుకు నీరు తరలిం చేలా నీటి పారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది.

మరిన్ని వార్తలు