డివిజన్ల పునర్విభజనపై ఆగ్రహం 

12 Jul, 2019 12:12 IST|Sakshi
మాట్లాడుతున్న కమిషనర్‌

అశాస్త్రీయంగా విభజన చేశారని అధికార, ప్రతిపక్షాల విమర్శలు 

అభ్యంతరాలు సమర్పిస్తే సరిచేస్తామన్న కమిషనర్‌

చంద్రశేఖర్‌కాలనీ: నిజామాబాద్‌ నగర పాలక సంస్థ(మున్సిపల్‌ కార్పొరేషన్‌)లో డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులతోపాటు అఖిలపక్ష నాయకులు మున్సిపల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం నగర పాలక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ డి. జాన్‌ సాంసన్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. డివిజన్ల పునర్విభజన శాస్త్రీయ పద్ధతిలో జరపలేదని, కార్యాలయాల్లో కూర్చొని, పాత బ్లాక్‌ లిస్టులు, పాత  డివిజన్లు, పాత ఓటరు లిస్టుల ఆధారంగా గజిబిజిగా, గందరగోళంగా, ఓటర్లంతా అయోమయానికి గురయ్యేవిధంగా డివిజన్ల పునర్విభజన జరిగిందని వారు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరెక్ట్‌గా డివిజన్ల పునర్విభజన చేసి ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచాలని, పోలింగ్‌ స్టేషన్‌ల వద్ద ల్యాబ్‌ట్యాప్‌లు, పోలింగ్‌ సరళిని లైవ్‌ కాస్ట్‌ చేయాలని బీజేపీ నాయకుడు స్వామి సూచించారు. ఓట్లు గల్లంతయ్యాని పలువురు ఆరోపించారు.  

సలహాలివ్వండి 
డివిజన్ల పనర్విభజన శాస్త్రీయ పద్ధతిలోనే చేశామని కమిషనర్‌ డి. జాన్‌ సాంసన్‌ ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులకు స్పష్టం చేశారు. కొన్ని డివిజన్లలో ఏరియాలు తారుమారు కావడం, ఓటరు లిస్టులలో పేర్లు మరో డివిజన్లలో నమోదు కావడం, ఇతరత్రా అభ్యంతరాలను నేడు, రేపు(12)న కార్పొరేషన్‌లో ఫిర్యాదులు చేస్తే సరిచేస్తామని సమాధానం ఇచ్చారు. గతంలో బూత్‌ లెవల్‌ ఏజెంట్‌లు ఇవ్వాలని అన్ని పార్టీల అధ్యక్షులను కోరినా ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఫర్‌ఫెక్ట్‌ ఓటరు లిస్టు కావాలంటే సహకరించాలని ఆయన కోరారు. 75 శాతం వరకు అభ్యంతరాలను పరిష్కరించామని, మిగితా 25 శాతం కూడా దరఖాస్తులు ఉదయమే ఇస్తే సరిచేస్తామని కమిషనర్‌ నచ్చజెప్పారు.   

>
మరిన్ని వార్తలు