ఓటర్లకు గాలం.. లాబీయింగ్‌ షురూ..

4 Dec, 2018 08:47 IST|Sakshi

ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌  

పోలింగ్‌కు మిగిలింది కేవలం రెండు రోజులే  

ఓట్లు రాబట్టేందుకు నాయకుల ప్రయత్నాలు

 ఎత్తుకు పైఎత్తులతో ఓటర్లకు గాలం  

సాక్షి వనపర్తి: ముందస్తు ఎన్నికల ప్రచారానికి ఈనెల 5వ తేదీతో గడువు ముగిస్తుండటం, 7న పోలింగ్‌ జరగనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. గడిచిన కొన్ని రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో కార్యకర్తలు, కులసంఘాలు, యువజన సంఘాలను కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల్లో ఎంత గొప్పగా ప్రచారం చేసినప్పటికీ పోలింగ్‌ సమయంలో మేనేజ్‌మెంట్‌ చేయకపోతే దాన్ని ఓట్లుగా మార్చడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఓటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే అసలు కథ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఓటర్‌ను పోలింగ్‌ కేంద్రం వరకు రప్పించి, ఓటు వేయించడంతో పోల్‌ మేనేజ్‌మెంట్‌ ముగుస్తుంది.  


బూత్‌స్థాయిలో బలమైన క్యాడర్‌  
పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయడంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కి గట్టి పట్టుంది. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపైనే దృష్టి సారించిన నాయకులు అధికారంలోకి వచ్చాక జరిగిన రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్‌ ఇతర పార్టీలలో బలమైన ప్రజాప్రతినిధులు, నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు చాలామంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

దీంతో పార్టీ బూత్‌ స్థాయిలో పటిష్టంగా మారింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో పాతుకుపోయి పేరుమోపిన నాయకులంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇతర పార్టీలకు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవమున్న నాయకులు టీఆర్‌ఎస్‌లో ఉండడంతో వారంతా ఈ ఎన్నికల్లో ఓటర్‌ను పోలింగ్‌ కేంద్రానికి రప్పించడానికి కృషి చేస్తున్నారు.

నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండటం, గత ప్రభుత్వాల హయాంలో కంటే ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమ పధకాలను అమలు చేశాము కాబట్టి క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు తమకే ఉందని టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.   


రాజకీయ అనుభవం ఉన్న వారితో..  
కాంగ్రెస్, టీడీపీలు 2014 ఎన్నికల వరకు ఉప్పు, నిప్పులా ఉన్న మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు పార్టీలు ఒక్కటై కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో నిలుచున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలలో చాలాఏళ్లపాటు పనిచేసిన నాయకులు, పార్టీ మారినా రాజకీయంగా అనుభవమున్న వారితో పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయించే పనిలో కూటమి అభ్యర్థులు ఉన్నారు.

పోల్‌ మేనేజ్‌మెంట్‌లో మొదటి నుంచి పట్టున్న టీడీపీ జతకట్టడంతో అధిష్టానం నుంచి ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి చర్యలు చేపట్టింది. మూడు దశాబ్దాలుగా వనపర్తి రాజకీయాల్లో ఉంటూ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మద్దతు కూడా చిన్నారెడ్డికి ఉండటంతో అది పోలింగ్‌లో ఉపయోగపడే అవకాశం ఉంది.   


ఇద్దరిదీ సుదీర్ఘ రాజకీయ అనుభవం  
వనపర్తి  నియోజవర్గం బరిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి 8వ సారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. 9వ సారి బరిలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడంతో ఓటర్లను ఆకర్శించడం, పోలింగ్‌ కేంద్రం వరకు తీసుకురావడంలో ఆయన దిట్ట. ఆయనకు తోడుగా ఎన్నికల సమయంలో అనుచరులు అధిక సంఖ్యలో రంగంలోకి దిగుతారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 2001 నుంచి కేసీఆర్‌ వెంట ఉద్యమంలో పాల్గొన్న అనుభవం, నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా పని చేయడంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకున్నాడు. 2001కి ముందు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఖాదీబోర్డు చైర్మన్‌గా పనిచేశారు. మొత్తానికి నిరంజన్‌రెడ్డికి మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉండడంతో ఆయన కూడా ఓటర్ల నాడిని పసిగట్టడంలో ముందుంటాడు.   

మరిన్ని వార్తలు