అభివృద్ధే నమ్మకం

22 Jul, 2018 09:45 IST|Sakshi
పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి తుమ్మల

ఖమ్మం వైరారోడ్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలకు తమపై నమ్మకాన్ని కల్పిస్తాయని రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో మధిర నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తమ పార్టీవైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం కష్టపడే వారి వెంటే ప్రజలు ఉంటారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా మధిర నియోజకవర్గం అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. వచ్చే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

అగస్టు 15 తర్వాత ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరందిస్తామన్నారు. చేతి వృత్తిదారుల కోసం రూ.1000 కోట్లు వెచ్చించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గొల్లకురుమలకు రూ.5000 కోట్లు వెచ్చించి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. చేప పిల్లలు పంపిణీతో పాటు, రైతుల కష్టాలు తీర్చేందుకు నిరంతరం కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. భవిష్యత్‌లో నాగార్జున సాగర్‌ నీటితో అవసరం లేకుండా సీతారామ ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాలో పారిస్తామన్నారు. సూర్యాపేట– ఖమ్మం రహదారి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. అలాగే ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నామన్నారు.

మెరుగైన వైద్యం అందించటంలో ఖమ్మం, భద్రాచలం ఆసుపత్రులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు. 2020 యేడాది కల్లా మిగులు రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావు, కార్యదర్శి తాతా మదు, విత్తనాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి సంస్ధ చైర్మన్‌లు కొండబాల కోటేశ్వరరావు, ఎస్‌.బి.బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, దయాకర్‌రెడ్డి, కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు