పల్లెకు తరలిన పట్నం!

8 Dec, 2018 02:12 IST|Sakshi

ఊళ్లకు భారీగా తరలిన ప్రజలు 

ఉదయం నుంచే.. టోల్‌గేట్ల వద్ద రద్దీ 

ఆర్టీసీలోనూ కొనసాగిన రద్దీ 

భారీగా సొమ్ము చేసుకున్న ప్రైవేటు ట్రావెల్స్‌  

కిక్కిరిసిన రైళ్లు, అదనపు రైళ్లకు నో! 

చార్జీలు, ప్రత్యేక వాహనాలు సమకూర్చిన నేతలు

సాక్షి, హైదరాబాద్‌: పల్లెల్లో ఓట్ల పండుగకు పట్నంవాసులు భారీగా తరలివెళ్లారు. నగరం, జిల్లా కేంద్రాలు, ఆయా పట్టణాల నుంచి భారీగా వాహనాలు రోడ్డు మీదకు రావడంతో రద్దీ నెలకొంది. తెలంగాణలోని అన్ని టోల్‌గేట్ల వద్ద వాహనాలు భారీగా బారులుతీరాయి. వరుస సెలవులు కావడంతో కొందరు ముందే వెళ్లినప్పటికీ, శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున బయల్దేరారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు ట్రావెల్స్‌తోపాటు సొంతవాహనాలు కూడా రోడ్డు మీదకు వచ్చాయి.  

స్పందించిన ఈసీ.. 
నిజామాబాద్, బెంగళూరు, విజయవాడ, వరంగల్‌ వెళ్లే జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిలో మొత్తం 13 టోల్‌గేట్లు ఉన్నాయి. కరీంనగర్‌ రాజీవ్‌ రహదారిపై 3, నార్కట్‌పల్లి– గుంటూరు మధ్యలో మరో 2 టోల్‌గేట్లు ఉన్నాయి. వరుస సెలవులు రావడంతో నగరం నుంచి జిల్లాలకు వాహనాలు పోటెత్తాయి. ఉదయం 9 నుంచి 11 గంటలకల్లా టోల్‌గేట్ల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. విషయం ఎన్నికల సంఘానికి చేరడంతో సీఈవో రజత్‌కుమార్‌ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు. వెంటనే జోషి నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు టోల్‌గేట్ల వద్ద రద్దీని నియంత్రించారు. ఎలాంటి ట్రాఫిక్‌ జామ్‌లు లేకుండా చేశారు. 

ఆర్టీసీలో ఎడతెగని రద్దీ.. 
ప్రజలు ఓట్లేసేందుకు భారీగా సొంతూళ్లకు కదలడంతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్‌ బస్టాండ్లు కిటకిటలాడాయి. గురువారం అర్ధరాత్రి మొదలైన రద్దీ శుక్రవారం ఉదయం 11 గంటల వరకు కొనసాగడం గమనార్హం. గురువారంరాత్రి ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ వైపు అధికంగా ప్రజలు తరలివెళ్లారు. దీంతో జేబీఎస్‌ రద్దీతో కిటకిటలాడింది. తెల్లవారుజామున బస్సులులేవని కొందరు ఆందోళనకు దిగారు. శుక్రవారం మాత్రం వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండకు అధికంగా ప్రయాణించినట్లు తెలిపారు. వెంటనే అధికారులు బస్సులు వేయడంతో ప్రయాణికులు శాంతించారు.

పోలింగ్‌ సమయాల్లో ఈ స్థాయిలో ప్రజలు ప్రయాణాలు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదని అధికారులు వ్యాఖ్యానించారు. గురు, శుక్రవారాల్లో ప్రత్యేకంగా 1,200 బస్సులు నడిపామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘానికి దాదాపు 2,000 బస్సుల వరకు పంపారు. రోజూ బస్సుల్లో 98 లక్షల మంది ప్రయాణం సాగిస్తారు. గురువారం అదనంగా 80,000 మంది ప్రయాణించారని అధికారులు తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో శుక్రవారం తిరుగు ప్రయాణంలో ఇదే రద్దీ కొనసాగకపోవడం గమనార్హం. ఒకరోజు ఆదాయం రూ.12 కోట్లు కాగా, గురు, శుక్రవారాల్లో దాదాపు రూ.కోటి వరకు అదనంగా వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంటికి వెళ్లాలన్న నగరవాసుల అవసరాన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ సొమ్ము చేసుకున్నాయి. 

కిక్కిరిసిన రైళ్లు! 
తెలంగాణలో వివిధ జిల్లాలకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి ఉదయంపూట బయల్దేరిన రైళ్లు కిటకిటలాడాయి. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి ప్రత్యేక రైళ్లు వేయకపోవడంతో గురువారంరాత్రి, శుక్రవారం ఉదయం రైళ్లు రద్దీగా కిటకిటలాడాయి.  

చార్జీలు పంచిన నేతలు, ప్రత్యేక వాహనాలు 
హైదరాబాద్, జిల్లాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వాళ్లందరికీ నేతలు బస్‌చార్జీలు పంచారు. మరికొందరు అల్వాల్, బాలానగర్, ఉప్పల్, రాజేంద్రనగర్‌ నుంచి తమ నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చాలా ముందస్తుగా, పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన నేతలు ప్రజలను సొంతూళ్లకు తరలించారు.   

మరిన్ని వార్తలు