నామినేషన్‌ ఫైట్‌.. నేతల బల ప్రదర్శన..!

17 Nov, 2018 10:37 IST|Sakshi

బలప్రదర్శనకు సిద్ధమవుతున్న ప్రధాన రాజకీయ పార్టీల నేతలు

 నేడు నామినేషన్లు వేయనున్న కూటమి, బీజేపీ అభ్యర్థులు 

భారీ జనసమీకరణకు నాయకుల వ్యూహాలు

సాక్షి, వనపర్తి: నామినేషన్‌ దాఖలు చేసిన రోజే తమ జనబలాన్ని ప్రదర్శిస్తే ఇక గెలిచినట్లేనని రాజకీయ పరిభాషలో చెబుతుంటారు. అలాంటి సందర్భం కోసమే ప్రస్తుతం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా ఇదే సంస్కృతి కొనసాగుతోంది. అదే తరహాలో మహాకూటమి అభ్యర్థి, వనపర్తి తాజామాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ జి.చిన్నారెడ్డి శనివారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు సమాచారం.

శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ రోజున రావాలని శ్రేణులను కోరినట్లు తెలిసింది. ఐదోరోజు శుక్రవారం వరకు ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అ«ధికారపార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రెండుసెట్ల నామినేషన్లు, స్వతం త్ర అభ్యర్థులు మూడుసెట్ల నామిషన్లు, సమాజ్‌వాది పార్టీ నుంచి అక్కల బాబుగౌడ్‌ నామినేషన్‌ వేశారు.

ఆరో రోజు తాజామాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థి కొత్త అమరేందర్‌రెడ్డితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. రోజు మూడురోజులుగా భారీ సంఖ్యలో జనసమీకరణలో నిమగ్నమయ్యారు. 


ఏర్పాట్లలో నాయకులు 
2014 ఎన్నికల సమయంలో చిన్నారెడ్డి స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో వేల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జనసమీకరణ చేసి అక్కడి నుంచి ర్యాలీగా ఆర్‌ఓ కార్యాలయం వరకు వెళ్లారు. ప్రధాన కూడళ్ల గుండా ర్యాలీలు, నృత్యాలు చేస్తూ డప్పులు కొడుతూ ఒంటెలు, ఎద్దుల ప్రదర్శనలతో నియోజకవర్గంలో తన బలాన్ని ప్రదర్శిస్తూ నామినేషన్‌కు బయలుదేరారు.

అదే తరహాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సైతం 2014లో నామినేషన్‌ వేశారు. కానీ ఈసారి ఎన్నికల సందర్భంగా నిరంజన్‌రెడ్డి ట్రెండ్‌ మార్చి అతి సాధారణంగా ఆలయాల్లో పూజలు చేసి నలుగురు వ్యక్తులతో కలిసి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మరోసారి నామినేషన్‌ వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు   తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు