‘కొండపోచమ్మ’కు పచ్చజెండా!

2 May, 2020 03:17 IST|Sakshi

నీటి విడుదల అభ్యర్థనపై హైకోర్టు సానుకూలం

బలవంతంగా బాధితుల తరలింపుపై ఆగ్రహం

సిద్దిపేట కలెక్టర్, ఆర్డీవోలపై ధర్మాసనం మండిపాటు

ఇందుకేనా తెలంగాణ అంటూ ఘాటు వ్యాఖ్యలు

అదనపు జిల్లా జడ్జి ద్వారా నివేదికకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈనెల 4న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా నీటిని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌లు చేసిన అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది. నీటిని విడుదల చేయరాదన్న గత ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల, బాహిలాంపూర్‌ గ్రామాలకు చెందిన ముంపు బాధితులు దాఖలు చేసిన వ్యాజ్యాలను శుక్రవారం ధర్మాసనం మరోసారి విచారించింది. ఒకసారి అవార్డు జారీ అయ్యాక తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

నీటిని విడుదల చేయడం వల్ల బహుళ ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉంటాయని, అయితే బాధితులకు పరిహారం, పునరావాసం వంటివి చట్ట ప్రకారం అమలు అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చింది. బాధితులకు చెరువు ఎల్‌టీఎఫ్‌ పరిధిలో కాకుండా గజ్వేల్‌లో రెండు పడక గదుల ఇళ్లలోకి వెళ్లేందుకు ఆసక్తి ఉంటే అందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వగలమని స్పష్టం చేసింది. కోతకు వచ్చిన పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నిల్వ ఉన్న పంటల్ని ప్రభుత్వమే భద్రపరచాలని ఆదేశించింది. బాధితులకు చెందిన పశువులను పశు వైద్యుల సమక్షంలో తరలించాలని అధికారులను ఆదేశించింది. చదవండి: 17దాకా లాక్‌డౌన్‌.. సడలింపులివే..!

రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి అయ్యిందని, 97 శాతానికి పరిహారం కూడా చెల్లించామని ఏజీ చెప్పారు. ఇతరులకు కూడా పునరావాస చర్యలు తీసుకుంటామన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ, అవార్డును సవాల్‌ చేశామని, దీనిపై హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే వరకూ నీటి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. అయితే ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని, కొద్ది మంది కోసం నీటిని విడుదల చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయినా అవార్డు జారీ అయ్యాక తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ, విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది.

నక్సలిజంవైపు అడుగులేస్తే ఎవరు బాధ్యులు
తొలుత విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మే 1 వరకూ హైకోర్టు గడువు ఇచ్చినప్పటికీ అధికారులు ఏప్రిల్‌ 30 రాత్రి 600 వందల మంది పోలీసులతో, పాతిక వాహనాల్లో వచ్చి బాధితులను బలవంతంగా ఖాళీ చేయించారని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఫోన్లు కూడా పనిచేయకుండా చేశారని తెలిపారు. బలవంతంగా ఇళ్ల నుంచి బాధితులను ఖాళీ చేయించడంపై కలెక్టర్, ఆర్డీవోలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామని మరిచిపోరాదని, ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నది ఇందుకేనా అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

పదిపన్నెండేళ్ల పిల్లల ఎదుట వారి తల్లిదండ్రులను లాక్కునిపోతుంటే, వారి ఇళ్లను కూల్చేస్తే ఆ పిల్లల్లో పాలకులపై వ్యతిరేక భావన ఏర్పడుతుందని, నక్సలిజం వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం కూడా ఉంటుందని, రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తారని, అదే జరిగితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను బ్రిటీష్‌ రాణి నియమించినట్టుగా భావించవద్దని ఘాటు వ్యాఖ్య చేసింది. ఈ మొత్తం ఘటనపై బాధితుల గోడును సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలాన్ని నమోదు చేసి పూర్తి నివేదికను తమకు అందజేయాలని సిద్దిపేట 4వ అదనపు జిల్లా జడ్జిని ధర్మాసనం ఆదేశించింది.   

మరిన్ని వార్తలు