శాసనమండలి ప్రశ్నోత్తరాలు...

17 Dec, 2016 03:02 IST|Sakshi

ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేయొద్దు
మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌


సాక్షి. హైదరాబాద్‌:  శుక్రవారం శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో మరే ఇతర అంశంపై చర్చకు ఆస్కారం లేదని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ స్పష్టంచేశారు. సమయాన్ని ఏ మాత్రం వృథా చేయొద్దని, అనుకున్న సమయంలో ప్రశ్నోత్తరాలు పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే గంటా ఇరవై నిముషాల వ్యవధిలోనే ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయా అంశాలపై అధికార, విపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలపై మంత్రులు సమాధానాలిచ్చారు. అవి సంక్షిప్తంగా...

వచ్చే జూన్‌ నాటికి డిజిటల్‌ క్లాసులు: కడియం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్లు, రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో వచ్చే జూన్‌ (2017) నాటికి డిజిటల్‌ క్లాసులను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అలాగే ప్రైమరీ స్కూళ్లలోనే అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి, అంగన్‌వాడీలు, ప్రీప్రైమరీలను జోడించి వాటి ద్వారా ఎన్‌రోల్‌మెంట్‌ పెంచేందుకు చర్యలు చేపట్టాలనే ఆలోచనతో ఆయన తెలిపారు.

జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనంపై పరిశీలన..
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని కడియం శ్రీహరి తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.

రైతుల దశ మారుతుంది: పోచారం
స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం కేంద్రం పంటలకు ధరలు కల్పిస్తేనే రైతుల భవిష్యత్‌ మారుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు అనుగుణంగానే రాష్ట్రంలో చెల్లిస్తున్నామన్నారు. ఈ ధరను నిర్ణయించే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పారు.

ఎలాంటి మార్పు ఉండదు: జూపల్లి
ఎన్నికైన జిల్లా పరిషత్‌ల కాలపరిమితి ముగిసే వరకు కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్తగా జిల్లాల విభజన జరిగినా గతంలోని పాత జిల్లా పరిషత్‌ల పరిధిలోకే ఆ జిల్లాలు కూడా వస్తాయని, విధులు, నిధులు, ఇతర విషయాల్లోనూ ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు.  

అనుకున్న విధంగా భద్రాద్రి ప్లాంట్‌: జగదీశ్‌రెడ్డి
భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను అనుకున్న విధంగా పూర్తిచేసి 2017–18లో ఉత్పత్తి దశకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఈ విద్యుత్‌ ప్లాంట్‌ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

వృద్ధాశ్రమాల ఏర్పాటుకు యత్నం: తుమ్మల
వృద్ధాశ్రమాలు లేని జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని రోడ్లు, భవనాలు, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు.

తండాల అభివృద్ధి బోర్డు ప్రతిపాదన లేదు
ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌
గిరిజన తండాల అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ తెలిపారు. దీనిని సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు.

మరిన్ని వార్తలు