‘నిమ్మ’ ధర..ఢమాల్‌! 

22 May, 2019 11:35 IST|Sakshi

నకిరేకల్‌  : వేసవికాలం నేపథ్యంలో నిమ్మ దిగుబడులు అధికంగా రావడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఒక బస్తా ధర రూ.1200 పలకగా, నాలుగు రోజులనుంచి పడిపోయింది. ప్రస్తుతం బస్తా ధర రూ.600లకు మించి రావడం లేదు. దీంతో నిమ్మ రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి.  ఏటా 2.50లక్షల టన్నుల దిగుబడులు వస్తాయి. అంటే రూ.300కోట్ల పైనే నిమ్మ వ్యాపారం సాగుతోంది. ఒక్కో నిమ్మకాయ బస్తా 22 కేజీలు ఉంటుంది.

ఒక్కో బస్తాలో లావుకాయ అయితే 600 వరకు, చిన్న కాయలైతే 900 వరకు నింపుతారు. గతంలో నిమ్మరైతులు దళారులకు అమ్ముకునేవారు. ఎన్నో ఏళ్లనుంచి రైతులనుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.3కోట్లతో నకిరేకల్‌లోని తిప్పర్తిరోడ్డు చిమలగడ్డ సమీపంలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిమ్మమార్కెట్‌ నిర్మించారు. ఈ మార్కెట్‌ ప్రారంభమైన నాటి నుంచి నాలుగు రోజు ల క్రితం వరకు కూడా ఒక నిమ్మ బస్తా ధర రూ. 900నుంచి రూ.1300 ధర పలికింది. ప్రస్తుతం  బస్తా ధర 400 నుంచి 600వరకు పడిపోయింది. ప్రధానంగా నిమ్మ దిగుబడులు అధికంగా రావడంతో ధరలు తగ్గుతున్నాయని మార్కెటింగ్‌ అధికారులు అంటున్నారు.

సాయంత్రం 6 గంటలనుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు
ఇక్కడ ఈ మార్కెట్‌లో ప్రతి రోజు సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు నిమ్మ వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్, సూర్యపేట, కోదాడ తదితర ప్రాంతాలకు చెందిన నిమ్మ బేరగాళ్ళు ఇక్కడికి  వచ్చి పాటలు పాడుతుంటారు. రైతులనుంచి కొనుగోలు చేసిన నిమ్మ దిగుబడులను హైదరాబాద్‌కు, అక్కడినుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. రైతు దగ్గరినుంచి గతంలో మార్కెట్‌ ప్రారంభం కాకముందు దళారులు 13శాతం కమీషన్‌ తీసుకునేవారు. ప్రస్తుతం నిమ్మ మార్కెట్‌ ప్రారంభం చేయడంతో 4శాతం మేర కమీషన్‌ భారం రైతుపై పడుతోంది.  నాలుగు రోజుల నుంచి గత ఏడాది కాలంగా కొనసాగిన ధర పడిపోవడంతో రైతులు కొంత నిరాశ నిసృహలకు లోనవుతున్నారు. 

బస్తా ధర రూ.900పైనే రావాలి
మాది శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామం. నాకు ఆరు ఎకరాల్లో నిమ్మ తోట ఉంది. ఇటీవల గాలి దుమారంతో నిమ్మకాయలు రాలిపోయాయి. పక్షం రోజుల క్రితం ఈ మార్కెట్‌కు వచ్చినప్పుడు ఒక నిమ్మ బస్తా ధర రూ.1000 వరకు వచ్చింది. నాలుగు రోజులనుంచి తగ్గింది. రూ.600కు మించి ధర రావడం లేదు. ఒక్క నిమ్మ బస్తాకు కనీసం రూ.900 పైబడి ధర పలికితే రైతుకు లాభం ఉంటుంది.  – తోట వీరయ్య, నిమ్మ రైతు, అంబారిపేట 

నిమ్మ ధరల్లో నిలకడ ఉండదు
నిమ్మ ధరలలో నిలకడ ఉండదు. నిమ్మ మార్కెట్‌ ప్రారంభించిన నాటినుంచి ఇప్పటి వరకు రైతుకు మంచి మద్దతు ధర లభించింది. నాలుగు రోజులనుంచి ధరలు తగ్గుముఖం పట్టిన విషయం వాస్తవమే. నిమ్మ కాయలు ఎక్కువ దిగుబడి వస్తే ధర తగ్గుముఖం పడతాయి. వేసవి నేపథ్యంలో నిమ్మకు మంచిడిమాండ్‌ ఉంటుంది. రైతులకు కూడా తగిన ధర వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – వెంకన్న, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి, 
నకిరేకల్‌ వ్యవసాయ మార్కెట్‌

మరిన్ని వార్తలు