కొనుగోల్‌మాల్‌!

24 Jan, 2018 18:25 IST|Sakshi
భువనగిరిలో సాగుతున్న కందుల కాంటా, (ఇన్‌సెట్‌లో) పట్టుబడ్డ లారీ

కందుల కొనుగోళ్లలో దళారులదే హవా

భువనగిరిలో పట్టుబడ్డ 17 టన్నుల కందులు

అనంతపురం నుంచి తెచ్చిన దళారీ

ఆలేరులోనూ సాగుతున్న దందా

తీవ్రంగా నష్టపోతున్న రైతన్న

జిల్లాలోని భువనగిరి, ఆలేరులో ఏర్పాటు చేసిన హాకా కందుల కొనుగోలు కేంద్రాల్లో గోల్‌మాల్‌ జరుగుతోంది. రైతులు తెచ్చిన కందులను వెంటనే కొనకుండా వివిధ అడ్డంకులు సృష్టిస్తూ దళారులు తెచ్చిన కందులను క్షణాల్లోనే కొనేస్తున్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్‌ యార్డులు అక్రమాలకు అడ్డాలుగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కందుల కొనుగోళ్ల విషయంలో దందా సాగుతున్నా.. ఎవరూ పర్యవేక్షించడం లేదు. ఫలితంగా జిల్లాలోని కందుల కొనుగోలు కేంద్రాలు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళారులకు సిరులు కురిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

సాక్షి, యాదాద్రి : జిల్లాలోని భువనగిరి, ఆలేరు వ్యవసాయ మార్కెట్లలో ఐదురోజుల క్రితం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పాలకవర్గాలు.. దళారులతో కుమ్మక్కై వారినుంచి టన్నుల కొద్దీ కందులను కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన కందులను మాత్రం కొనకుండా రేపుమాపు అంటూ కేంద్రాలకు తిప్పుకుంటూ దళారులు తేగానే క్షణాల్లో కొనేస్తున్నారు. ఇందంతా అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతోంది.

ఇందుకు ఉదాహరణ ఆలేరులో ఐదు రోజుల క్రితం కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించగా అదేరోజు ఆలేరు మండలానికి చెందిన ఓ రైతు 30 సంచుల కందులను తెచ్చాడు. ఆ రైతు తెచ్చిన కందులను ఈ రోజు వరకు కొనుగోలు చేయలేదు. ప్రతిరోజు కార్యాలయం చుట్టూ అధికారుల చుట్టూ తిరిగిపోతున్నా.. స్పందన లేదు. మరోవైపు సోమవారం వరకు ఆలేరు మార్కెట్‌లో 1,400 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. భువనగిరిలో 1,100 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఈ మొత్తం కొనుగోళ్లపై విచారణ జరిపిస్తే భారీ కుంభకోణం బయటపడుతుందని రైతులు చెబుతున్నారు.

తాజా ఘటన ఇలా..
మంగళవారం అనంతపురం జిల్లా నుంచి లారీలో తెచ్చిన కందులను భువనగిరి కొత్త మార్కెట్‌ యార్డులో విక్రయిస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకోవడంతో దళారుల దందా వెలుగు చూసింది. ఈ కందులు అనంతపురం నుంచి వచ్చాయా లేక స్థానిక దళారులు తెచ్చినవా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా మార్కెట్‌ కమిటీ పాలకవర్గం, అధికారుల కనుసన్నలలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. గత సంవత్సరం కూడా కందుల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ చేపట్టింది. కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కందులు కొనుగోలు చేయడానికి  పట్టాదారు పాస్‌ పుస్తకాలు, బ్యాంక్‌ అకౌంట్లు, వీఆర్వోల ధ్రువీకరణలతో వందలాది క్వింటాళ్ల కందులు మార్కెట్‌ యార్డ్‌ల్లో కొనుగోలు జరుగుతోంది.

రూ.5,450 మద్దతు ధర..
జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మార్కెట్‌యార్డ్‌లలో హాకా ద్వారా ప్రభుత్వం కందులను కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5250, బోనస్‌ రూ.200 కలిపి ప్రతి క్వింటాల్‌కు రూ.5450 చెల్లిస్తున్నారు. సకాలంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రకరకాల కొర్రీలతో కొనుగోలు చేయకుండా రైతులను తిప్పుకోవడంతో విసిగిపోయిన రైతులు గ్రామాల్లో దళారులకు క్వింటాల్‌ రూ.3500నుంచి రూ.4000 వరకు అమ్ముకుంటున్నారు. వీటిని దళారులు తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ.5,450లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
 

ఆ కందులు ఎక్కడివి!
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన లారీలో 17 టన్నుల కందులు భువనగిరి మార్కెట్‌కు భువనగిరి మండలం పచ్చర్లబోడుతండాకు ఇస్మాయిల్‌ ఉదయం లారీలో తెచ్చాడు. సుమారు 7 టన్నుల వరకు కందులను లారీలోంచి మార్కెట్‌లో దించారు. విషయం గమనించిన రైతులు విషయం తెలుసుకున్న భువనగిరి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రెడ్డి, బొల్లేపల్లి వీఆర్‌ఓ లక్ష్మినర్సయ్యను పిలిపించి లారీలోంచి దించుతున్న కందులను అడ్డుకున్నారు. ఇదేలారీ మార్కెట్‌ నుంచి మాయమై రాత్రి వరకు భువనగిరి పట్టణ శివారులోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. అనంతరం అక్కడినుంచి ఆ లారీ వెళ్లిపోయింది. కానీ అది ఎక్కడికి వెళ్లిందో.. ఆ లారీ ఏమైనట్లో ఎవరికీ తెలియదు. అలాగే ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో స్థానిక దళారులతో కలిసి కందుల విక్రయాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తాము పండించిన కందులను కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం భువనగిరి మార్కెట్‌ యార్డ్‌లో గడ్డం శ్రీనివాస్‌ అనే వ్యాపారి విక్రయించిన 30 క్వింటాళ్ల కందులపై విజిలెన్స్‌ అధికారులు కేసు నమోదు చేశారు.

కొనుగోళ్ల బాధ్యత  ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిదే..  
మార్కెట్‌ యార్డుల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. మార్కెట్‌ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు కొనుగోలు బా«ధ్యతలను ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు కనిపిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిపై నిఘా లేకుండాపోయింది. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించి తమకు నాయ్యం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా