హెచ్‌సీయూలో చిరుత?

12 Jan, 2019 09:13 IST|Sakshi
చిరుత కోసం గాలిస్తున్న సిబ్బంది ,చిరుతదిగా భావించిన అడుగు దృశ్యం

చూశానంటున్న సెక్యూరిటీ గార్డు  

గాలిస్తున్న అటవీ శాఖ, వైల్డ్‌లెన్స్‌ బృందాలు  

ఎలాంటి ఆధారాలు దొరకని వైనం

రాయదుర్గం: నగర శివారులో కనిపించిన చిరుత గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) క్యాంపస్‌లోకి వచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 1:30గంటలకు ఎల్‌హెచ్‌–6 ప్రాంతంలో చిరుత కుక్కను వెంబడించగా తాను చూశానని హెచ్‌సీయూ సెక్యూరిటీ గార్డు పేర్కొనడంతో అందరూ అప్రమత్తమయ్యారు. అటవీశాఖ అధికారులు, వైల్డ్‌లెన్స్‌ బృందం, సెక్యూరిటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటి వరకు చిరుతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. నగర శివారు యాచారం కొత్తపల్లి ప్రాంతంలో సంచరించిన చిరుతే వ్యవసాయ విశ్వవిద్యాలయం, హెచ్‌సీయూ క్యాంపస్‌లోకి వచ్చినట్లుగా పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే గాలింపు చర్యలు చేపట్టగా ఆధారాలు దొరకలేదు. ఏదేమైనప్పటికీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని వర్సిటీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

లేదంటున్న అధికారులు...  
కుక్కను చిరుత వెంబడిస్తే దాన్ని చంపేంత వరకు వదలదని, కానీ 24గంటలు గడిచినా కుక్క మృతదేహం ఎక్కడా కనిపించ లేదని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం రక్తపు మరకలు కూడా ఎక్కడా లేవంటున్నారు.  
ఇటీవల క్యాంపస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా... జింకపిల్ల, రెండు పాములు, ఒక ఎలుక మరణించాయి. అయితే జింక పిల్ల తల కొరికేసినట్లుగా ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ చిరుత ఉంటే? అది జింకను కొరికిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ జింక అగ్నిప్రమాదంలోనే మరణించిందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ చిరుత ఉన్నట్లయితే ఈ 11రోజుల వ్యవధిలో క్యాంపస్‌లో ఎక్కడో ఓ చోట కనిపించేదంటున్నారు. చిరుత లేదు కాబట్టే ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదన్నారు.   

ఉంటే రావాల్సిందే..   
ఒకవేళ చిరుత క్యాంపస్‌లో పరిధిలో ఉంటే నీటి కోసం తప్పనిసరిగా చెరువుల వద్దకు రావాల్సిందే. క్యాంపస్‌ పరిధిలో నాలుగు లేక్స్‌ (పికాక్‌ లేక్, బఫెలో లేక్, మార్మేడ్‌ లేక్, మరొకటి) ఉన్నాయి. క్యాంపస్‌లో సుమారు 500 ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో అనే రకాల జంతువులు ఉన్నాయి. అవన్నీ ఈ లేక్స్‌ దగ్గరే నీళ్లు తాగుతాయి. చిరుత కూడా నీటి కోసం వీటి దగ్గరికి రావాల్సిందే. ఈ నేపథ్యంలో గాలింపు బృందాలు వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఒకచోట అడుగు గుర్తులు కనిపించినా, అవి చిరుతవి కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

గతంలోనూ...  
కొన్నేళ్ల క్రితం హెచ్‌సీయూ క్యాంపస్‌కు 11కిలోమీటర్ల దూరంలోని పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో, బంజారాహిల్స్‌లోనూ చిరుత కనిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఎక్కడా చిరుత ఆనవాళ్లు  కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇవన్నీ పుకార్లు మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ చిరుత రాత్రి వేళల్లోనూ సంచరిస్తుంటుందని, ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్తుంటుందని పేర్కొంటున్నారు. చెట్లు, ప్రహరీలను సులభంగా ఎక్కేస్తుందంటున్నారు.  

కెమెరాల ఏర్పాటు...  
చిరుత రాత్రి వేళల్లోనే ఎక్కువగా సంచరిస్తుందని, అందుకోసం క్యాంపస్‌ అటవీ ప్రాంతంలో ట్య్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు.
అటవీ ప్రాంతం, లేక్స్‌ ప్రదేశాల్లో వీటిని అమర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా విద్యార్థులంతా అలర్ట్‌గా ఉండాలని.. గ్రీన్‌జోన్, రాక్‌జోన్, లేక్స్‌ వైపు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు