కుష్ఠుపై సమరం

22 Oct, 2018 06:55 IST|Sakshi
వీపు, చెవిపై కుష్ఠు వ్యా«ధి ప్రారంభ దశ మచ్చలు, దద్దుర్లు

ఖమ్మంవైద్యవిభాగం: కుష్ఠు వ్యాధి నిర్మూలన ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి విస్తృత అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్‌ 4వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందు కోసం 1470 బృందాలను సిద్ధం చేశారు. గ్రామాల్లో ఇంటింటి సర్వేలో భాగంగా ఏఎన్‌ఎం పర్యవేక్షణలో ఆశ, మేల్‌ వలంటీర్‌ వివరాలు నమోదు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9వరకు నిర్వహించి..ఆ ఇంటికి ఎల్‌ మార్క్‌ పెడతారు. సదరు గృహంలో వివరాలు తెలపని వారు ఎవరైనా మిగిలి ఉంటే..ఎక్స్‌ గుర్తు పెడతారు.

పూర్తి సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అధికారులు నేరుగా వెళ్లి వారికి మందులిచ్చే ప్రక్రియ చేపట్టనున్నారు. కుష్ఠువ్యాధి గ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకే ఇంటింటి సర్వే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి లోపువారికి ఈ నెల 24న వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.

జిల్లాలో ఈ ఏడాది 81కేసులు నమోదు ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం..81 కుష్ఠు కేసులు నమోదయ్యాయి. గతేడాది 131 కేసులు ఉన్నాయి. ముఖ్యంగా తిరుమలాయపాలెం మండలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే ఖమ్మంఅర్బన్, ఖమ్మం రూరల్‌....కూసుమంచి మండలాల్లో కూడా వ్యాధిగ్రస్తులు ఉన్నారు.  ప్రజల్లో అవగాహన లేమి కూడా కారణంగా కనిపిస్తోంది. ఎక్కువగా వ్యాప్తి చెందుతుందడటంతో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల జాబితాలో ఖమ్మంను చేర్చింది. వ్యాధివ్యాప్తిని అరికట్టేందుకు పలుసార్లు  సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించారు.
 
కుష్ఠు అంటే..?
కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రే లనే సూక్ష్మ క్రిమి వల్ల సంక్రమిస్తుంది. ప్రధానంగా ఇది చర్మం, నరాలకు సోకుతుంది. నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం అయ్యేందుకు సగటున 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. వ్యాధి ఎవరికైనా రావచ్చు. దీనికి వయస్సు, లింగభేదం ఉండదు. వంశపరంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. బహుళ ఔషధ చికిత్సతో తీవ్రతనుబట్టి 6 నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చు.
 
వ్యాధి రకాలు.. 
కుష్ఠు వ్యాధిని రెండు రకాలుగా పిలుస్తారు. మొదటిది పాసీ బేసిలరీ లెప్రసీ(పీబీ). శరీరంపై ఒకటి నుంచి ఐదు మచ్చలు వస్తాయి. మలీ బేసిలరీ లెప్రసీ(ఎంబీ) రెండో రకానికి చెందినది. శరీరంపై మచ్చలు ఆరు కంటే ఎక్కువగా కనిపిస్తాయి. అంతే కాకుండా ఒకటి కంటే ఎక్కువ నరాలకు సోకడం దీని లక్షణం. 

కుష్ఠు లక్షణాలు.. 
కుష్ఠు వ్యాధి మచ్చలు సహజ చర్మపు రంగు కంటే తక్కువ, ఎరుపు లేదా రాగి రంగు కలిగి ఉంటాయి. మచ్చపై స్పర్శ ఉండదు. నొప్పి ఉండదు. ఇవి..దేహంలోని ఏ ప్రదేశంలోనైనా రావచ్చు.

చికిత్స విధానం. 
కుష్ఠువ్యాధి రెండు లేక మూడు ఔషధాల కలయిక గల బహుళ ఔషధ చికిత్స(ఎండీటీ)తో పూర్తిగా నయమవుతుంది. ప్రారంభదశలోనే వ్యాధిని గుర్తించడం, వ్యాధి సోకిన వారికి పూర్తి ఎండీటీ చేయించటం ద్వారా అరికట్టవచ్చు. ఎండీటీ చికిత్స అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. తక్కువ తీవ్రత కలిగిన వ్యాధిగ్రస్తునికి 6 నెలలు, ఎక్కువ తీవ్రత కలిగిన వ్యక్తులు 12 నెలల పాటు మందులు వాడాలి.

మందులు సక్రమంగా వాడితే ఏదశలో ఉన్న కుష్టు వ్యాధి అయినా..నయం అవుతుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే..అంగవైకల్యాన్ని కూడా నివారించవచ్చు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్ఠు వ్యాధికి చికిత్స ఉచితంగా లభిస్తుంది. మైక్రో సెల్యూలార్‌ రబ్బర్‌ పాదరక్షలు ఉచితంగా అందిస్తున్నారు. అంగవైకల్యం ఉన్న అర్హులైన వ్యాధి గ్రస్తులకు రీ కన్సట్రక్టివ్‌ సర్జరీ ఉచితం. రూ.8000 ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు.  

వందశాతం సర్వే పూర్తి చేస్తాం.. 
కుష్ఠు వ్యాధి గ్రస్తుల సర్వే వందం శాతం పూర్తి చేస్తాం. రెండు వారాలపాటు ఆశ, మేల్‌ వాలంటీర్‌ ద్వారా ప్రతి ఒక్కరి వంటిపైనా ఏమైనా మచ్చలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. పూర్తిస్థాయిలో సర్వే చేసిన తర్వాత మచ్చలు ఉన్నవారికి పరీక్షలు చేసి కుష్ఠు వ్యాధి గ్రస్తులను గుర్తిస్తారు. కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దే వరకు కృషి చేస్తాం.  –కళావతిబాయి, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు