గ్రామాల్లో వలస ఓటర్ల సందడేదీ?

11 Apr, 2019 10:09 IST|Sakshi

సాక్షి, అడ్డాకుల: లోక్‌సభ ఎన్నికలు గురువారం జరుగనున్న నేపథ్యంలో ఈసారి వలస ఓటర్లపై నాయకులు పెద్దగా దృష్టి సారించలేదు. గత శాసనసభ, సర్పంచ్‌ ఎన్నికలప్పుడు గ్రామాల్లో వలస ఓటర్లతో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈసారి ఆ సందడి కనిపించడం లేదు. దూర ప్రాంతాల నుంచి ఓట్లు వేయడానికి గ్రామాలకు వచ్చే ఓటర్లు పదుల సంఖ్యలో కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతి ఎన్నికలప్పుడు నేతలు దూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లకు రవాణా ఖర్చులు అందజేసి ఓట్లు వేయడానికి ఊర్లకు రావాలని వలస ఓటర్ల వద్దకు వెళ్లి కలిసేవారు.

లోక్‌సభ ఎన్నికలు కావడం, వరుస ఎన్నికలు రావడంతో వలస ఓటర్లను రప్పించడానికి నేతలెవరు పెద్దగా ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. వలస ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించడానికి అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారని కొందరు నాయకులు నిర్మోహమాటంగా చెబుతుండటం విశేషం. అలాగే రానున్న పరిషత్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌ ఎన్నికలకు వస్తే పరిషత్‌ ఎన్నికలకు రారేమోనని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని గ్రామాల్లోని నాయకులు పట్టించుకోవడం లేదు. 

మరిన్ని వార్తలు