శిక్షలు, జరిమానాలు నామమాత్రమే

13 Jan, 2016 03:40 IST|Sakshi

 అందుకే జంతుహింస పెరుగుతోంది
చట్ట సవరణలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం
రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం
హైకోర్టుకు నివేదించిన తెలంగాణ సర్కార్


 సాక్షి, హైదరాబాద్: జంతుహింస నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. శిక్షలు, జరిమానాలు నామమాత్రంగా ఉండడం వల్లే జంతుహింస ఆగడం లేదని ఉమ్మడి హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. కఠిన శిక్ష, జరిమానాలకు వీలుగా చట్టాలను సవరించాల్సిన అవసరముందని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించింది. జంతుహింసను విచారణకు స్వీకరించదగ్గ నేరం (కాగ్నిజబుల్)గా పరిగణించాలని కూడా కేంద్రాన్ని కోరనున్నామని నివేదించింది. రాష్ట్రస్థాయిలో జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపింది.

జంతుహింస నిరోధక చట్టాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠినచర్యలు తప్పవని సంబంధిత అధికారులకు స్పష్టం చేసినట్లు పేర్కొంది. మార్కెట్ కమిటీల నిధులతో అన్ని పశు సంతల్లో ర్యాంపులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వివరించింది. పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలోని పశువుల మార్కెట్‌లో జంతువులను తీవ్రంగా హింసిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, జంతుహింస నిరోధంపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలా అధికారులను ఆదేశించాలంటూ జంతురక్షణ సంఘం, గో సంరక్షణ ఫెడరేషన్, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం జంతుహింస వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఏపీ కౌంటర్ దాఖలు చేసింది. కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జంతువులను అక్రమంగా తరలిస్తూ క్రూరంగా వ్యవహరిస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించేందుకు సమన్వయంతో పనిచేయాలని రవాణా, పోలీస్, పశు సంవర్థకశాఖలతో జరిగిన సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. జంతు రవాణాపై ఫిర్యాదులు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని, జంతుహింస నిరోధక సొసైటీలు(ఎస్‌పీసీఏ)లను 8 జిల్లాల్లో ఏర్పాటు చేశామని, మిగిలినచోట్ల త్వరలోనే ఏర్పాటు చేస్తామని నివేదించారు.
 
 రిజిస్ట్రేషన్ తప్పనిసరి...
 ‘చట్ట ప్రకారమే జంతు రవాణాకు అనుమతినిస్తాం. వెటర్నరీ డాక్టర్ జారీ చేసే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా జంతువుల తరలింపునకు అనుమతినివ్వబోం. జంతువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు పశుసంపద వ్యాపారులు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలి. జంతు రవాణాకు జిల్లా అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. తెలంగాణలో ప్రస్తుతం 19 పశు సంతలున్నాయి. జంతు రవాణాలో నిర్లక్ష్యం వహిస్తే రూ.1000 జరిమానా విధించే అధికారం రవాణాశాఖ కమిషనర్‌కు ఉంది’ అని రాజీవ్‌శర్మ తన కౌంటర్‌లో పేర్కొన్నారు..
 

>
మరిన్ని వార్తలు