నిమిషం లేటైనా... నో ఎంట్రీ

21 May, 2014 04:38 IST|Sakshi
నిమిషం లేటైనా... నో ఎంట్రీ
  •      కన్వీనర్ ఎన్వీ రమణరావు
  •      రేపే ఎంసెట్-2014 ప్రవేశపరీక్ష
  •      నగరంలో 8 జోన్లు.. 148 పరీక్ష కేంద్రాలు
  •      గ్రేటర్‌ నుంచి 81,445 మంది అభ్యర్థులు
  •      మెడిసిన్‌కు అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికం
  •  సాక్షి, సిటీబ్యూరో: ‘ఇంజినీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎంసెట్)-2014 గురువారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష జరుగుతాయి. అభ్యర్థులను నిర్దేశిత సమయం కన్నా గంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తాం.

    నిమిషం లేటుగా వచ్చినా అనుమతించం. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చే శాం. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు కూడా పకడ్బందీ చర్యలు చేపట్టాం’ అని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణరావు పేర్కొన్నారు. నగరంలో ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్ల గురించి మంగళవారం ఆయన విలేకరులకు వివరించారు. మరో 24గంటల్లో ఎంసెట్ పరీక్షకు హాజరుకాబోతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.
     
    కన్వీనర్ ఏం చెప్పారంటే..
    నగరంలో మెట్రోపనులు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు వారి నివాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల రేడియస్‌లో పరీక్షా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీని నివారించేందుకు ఈసారి మెడికల్ పరీక్ష ఉన్న కేంద్రాల్లో ఇంజినీరింగ్ అభ్యర్థుల సంఖ్యను తగ్గించాం.
         
    గతంలో మాదిరిగానే ‘నిమిషం లేటు’ నిబంధన ఈసారి కూడా అమల్లో ఉంది. ఒక్క నిమిషం లేటైనా అనుమతించం. అభ్యర్థులు లేదా వారి తల్లిదండ్రులు పరీక్షాకేంద్రాన్ని ఒకరోజు ముందుగా చూసుకుంటే మేలు. చివరి నిమిషంలో పరీక్షాకేంద్రం ఎక్కడుందోనన్న హైరానా తప్పుతుంది. అలాగే ఒక అభ్యర్థి వెంట అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు వీలైనంత వరకు(ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా) రాకుండా ఉంటే మంచిది.
         
    అభ్యర్థులు తమ వెంట కేవలం బాల్‌పాయింట్ పెన్నులు, హాల్‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, ఎస్సీ, ఎస్టీ కేటగిరి వారైతే కుల ధ్రువీకరణ పత్రం తెచ్చుకుంటే చాలు. సెల్‌ఫోన్లు, గాగుల్స్, డిజిటల్ వాచీలు.. వగైరా గ్యాడ్జెట్లు నిషేధం. తెల్లకాగితం తెచ్చినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక బస్సుల కోసం ఆర్టీసీ, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
         
    పరీక్షాకేంద్రాల సమీపంలో ఉండే హోటళ్లు, దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలపై మఫ్టీలో ఉన్న పోలీసుల నిఘా ఉంటుంది. మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్ష హాల్లోనూ ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తారు.
         
    24న ప్రాథమిక కీ ప్రకటిస్తాం. వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి తుది కీని వెలువరిస్తాం. జూన్ 9న ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశాం.
         
    దళారులను నమ్మొద్దు. ప్రలోభాలకు గురికావద్దు. మాయమాటలు చెబుతున్న వారి సమాచారాన్ని పోలీసులకు గానీ, ఎంసెట్ అధికారులకు గానీ తెల్పండి. ఎంసెట్ ప్రక్రియంతా పారదర్శకంగా ఉంటుంది.
     
    81,445మంది అభ్యర్థులు

    ఎంసెట్-2014కి నగరం నుంచి 81,445మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పరీక్షకు 58242మంది అభ్యర్థులు ఉండగా, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్షకు 23203మంది అభ్యర్థులున్నారు. ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో అబ్బాయిలు 37,644మంది ఉండగా, అమ్మాయిలు 20,598మంది ఉన్నారు. మెడికల్ అండ్ అగ్రికల్చర్‌కు మాత్రం అబ్బాయి కంటే అమ్మాయిలే అధికంగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష 7197మంది అబ్బాయిలు రాస్తుండగా, రెట్టింపు సంఖ్యలో 16006 మంది అమ్మాయిలు రాస్తున్నారు. నగరంలో ఇంజినీరింగ్ పరీక్షకు 100 కేంద్రాలు, మెడికల్ పరీక్షకు ఏకంగా 48 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
     

మరిన్ని వార్తలు