భాషాభివృద్ధికి ఇలా చేద్దాం...!

13 Dec, 2017 03:58 IST|Sakshi

తెలుగును అధికారిక వ్యవహారాల్లో  తప్పనిసరి చేయాలనడం మాతృభాషా వ్యామోహమో, భాషా దురభిమానమో కాదు. ఇది, ఒక భాషా ప్రయుక్త సమాజ వికాసానికి సంబంధించిన అంశం. ప్రజాస్వామ్య పాలనలో ఫలాలు సంపూర్ణంగా సామాన్యులకు అందాలనే, నిజమైన పారదర్శక పాలన కోసమే! ప్రభుత్వానికి–అధికారులకు, నాయకులకు–అధికారులకు, ప్రభుత్వ వివిధ విభాగాలు–ప్రజలకు మధ్య జరిగే ఉత్తరప్రత్యుత్తరాలన్నీ మాతృభాషలో జరిగితే ప్రజలకు ఎంతో మేలు. చట్టసభల్లో, పాలకమండళ్ల్లలో, సభలు–సమావేశాల తీర్మానాల్లో, ప్రభుత్వ ఉత్తర్వుల్లో–ఆదేశాల్లో, న్యాయస్థానాల తీర్పుల్లో అంతటా మాతృభాషనే వాడాలి. అలా కాక అన్యభాషలో జరిగినపుడు దళారులు రాజ్యమేలుతారు. సదరు అన్యభాషతో లోతైన పరిజ్ఞానం ఉన్నవారు, భాష రానివారి ప్రయోజనాలను పణంగా పెట్టి అనుచిత లబ్ధి పొందే ప్రమాదముంది. ఇక్కడ ఇంగ్లిషు–తెలుగు భాషల విషయంలో జరుగుతున్నదదే! దీన్ని పరిహరించి, సమత్వ సాధనకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మాతృభాషాభివృద్ధి్దకి కృషి చేయాలి. అందుకోసం, కొన్ని వెసులుబాట్లు, రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ఇది అసాధారణమేమీ కాదు. విశ్వవ్యాప్తంగా ఉన్నదే!

- ప్రభుత్వం నిధులు వెచ్చించి, భాషా శాస్త్రజ్ఞులు, సామాజికవేత్తలు, నిపుణులతో కమిటీ వేసి ముందు ఉన్నంతలో భాషను ప్రామాణీకరించాలి.
సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తెలుగే ఉపకరణం కనుక, అలా సాధించిన గ్రామాలకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
1–12 తరగతుల్లో తెలుగును తప్పనిసరి చేస్తామంటున్నారు కనుక  ఉత్తీర్ణత కోసం (ఇప్పుడు సంస్కృతం, ఫ్రెంచ్‌ వంటివి చదువుతున్నట్టు) కాకుండా చిత్తశుద్ధి్దతో చదివేలా ఉన్నత విద్యలో, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారికి అదనపు ప్రాధాన్యత (వెయిటేజీ/రిజర్వేషన్‌) కల్పించాలి.
తమ దైనందిన కార్యకలాపాల్లో తెలుగు రాసే అధికారులకు ప్రోత్సాహకాలు, వాడని వారికి జరిమానాలు విధించాలి.
తెలుగు పాత సాహిత్యాన్ని విరివిగా ప్రచురించి, సామాన్యులకు చౌకగా అందుబాటులోకి తేవాలి.
- దిలీప్‌ రెడ్డి

పాతకాలంలో వార్తలు ఇలా రాసేవారు
కొన్నాళ్ల కిందట కృష్ణలో వ్యసనకరమయిన వక సంగతి జరిగి అందువలన అనేక ప్రాణహాని హేతువ అయినది. సుమారు నూటికి జనం యెక్కి వక పడవ– బెజవాడ రేవు దాటేటప్పుడు యేటిన తెమికీ పోయి మహా వేగముతో వక పెద్ద రాతినట్టుకు తగిలి దాపు దాపుగా అందులో నుండిన బాటసార్లందరు చనిపోయినారు. ఆ పడవ నీళ్ల వడికి నిలువలేక బహువేగముగా పోతూ వొడ్డిగిలినందువలన నిముషములో నీరు నిండి ముణిగిపోయినది. ముగ్గురు మాత్రము తప్పి వచ్చినారు– ఇది బాజారి ఖబురుగా తెలిసినది గాని అధికారత్వేనా వకరికి సమాచారము అందలేదు. ఆ రేవున వుండే కృష్ణ వెడల్పు సుమారు కోశెడు దాకా ఉన్నది. అక్కడ సంభవించిన పడవ స్థితి వ్రాసి వచ్చినందు వలన నీళ్ల రేవులు పడవల మీద దాటేవారికి జాగ్రత్త కలుగవలెనని తెలియచేసినాము.
– 1842 ఆగస్టు 11, వర్తమాన తరంగిణి వారపత్రిక(డాక్టర్‌ జె.చెన్నయ్య ‘తెలుగు దినపత్రికలు: భాషా సాహిత్య స్వరూపం’ నుంచి...)

షడ్రుచుల ‘పద్యా’న్నం!
ఏనుగులావెంత, యిల మావటీదెంత, తిమిరంబు బలమెంత,దీపమెంత
ఘనసముద్రంబెంత, కర్ణధారకుడెంత, బహుకాననంబెంత, పరశువెంత
పారెడు నీరెంత,పర్వతంబదిఝెంత, హరుడెంత, మదులపుష్పాస్త్రమెంత,
భీకరఫణిఝెంత, వాకట్టు వేరెంత, బహురాజ్యమెంత, భూపాలుడెంత
ఝెవ్వరికి దొడ్డుకొంచెంబు లెంచరాదు, నడచు నిటువంటివెల్ల  నీ నాటకటములు
–తాళ్లపాక తిమ్మనాచార్యులు 

ఎంత...చిన్న పదం. నువ్వెంత అంటే నువ్వెంత అంటుంటాం. కానీ ఈ పద్యంలో ఎంత... ఎంతో ఎంతెంతగానో కనిపిస్తుంది. కవి చమత్కారం సరే. దాన్ని ప్రదర్శించే  శక్తి భాషకుఉండాలి కదా. తెలుగుకు ఆ సత్తా ఉంది. తాళ్లపాక అన్నమాచార్య కుమారుడు తాళ్లపాక తిమ్మనాచార్యులు రాసిన ఈ పద్యంలో ‘ఎంత’ ఎంత వింతలు చేసిందో చూడండి. ఏనుగు ఎంత లావుంది...మావటీడుని చూడగానే దారికొచ్చేస్తుంది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా పరిగెత్తించేందుకు చిన్న దీపం చాలు. సముద్రం ఎంత పెద్దదైతేనేం...దాన్ని చీల్చుకు వెళ్లే నావికుడు చిన్నవాడే. ఎంత గొప్ప హరుడైనా... మన్మథుడు వేసిన చిన్న పూబాణానికి చిత్తయ్యాడు. రాజ్యం ఎంత పెద్దదైనా...పాలించే రాజు ఒక మనిషే. ఇదీ తెలుగు పద్యమంటే! ఒక్కొక్క పాదం పూర్తవుతుంటే భావం విమానంలా పైకి లేస్తుంది. చివరి పాదంలో  పెద్ద చిన్న అంటూ తేడాలు చూపడం సరికాదు అని ముగిస్తాడు. ఈ విషయం చెప్పేందుకు ఎంత చక్కని దారి ఎంచుకున్నాడో. భాషకు రససమర్పక శక్తి ఉంది కాబట్టే ‘ఎంత’ అనే చిన్న పదం ఇంతింతై మనసును ఆక్రమిస్తుంది.    
– రామదుర్గం

మరిన్ని వార్తలు