ఒడిషా కూలీలకు విముక్తి

17 Apr, 2018 10:54 IST|Sakshi
ఒడిషా కూలీలు

ఇటుక బట్టీల్లో వేధింపులకుగురిచేస్తున్నారని ఫిర్యాదు

కార్మిక శాఖ అధికారుల విచారణ  

ఎల్మినేడులో ఎల్‌ఎన్‌బీబట్టీలపై దాడి

80 మంది కూలీలను ఒడిషాకు తరలించిన అధికారులు

ఇబ్రహీంపట్నంరూరల్‌: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలను యజమానులు వేధింపులకు గురిచేస్తున్నారని అందిన ఫిర్యాదుతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఇటుక బట్టీ వద్దకు అధికారులు వచ్చి విచారించగా ఇబ్బందులకు గురిచేస్తున్నది వాస్తవమేనని బటయపడింది. తాము ఇక్కడ పనిచేయలేమని తమ రాష్ట్రానికి వెళ్లిపోతామని అధికారులకు మొరపెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామ శివారులోని ఎల్‌ఎన్‌బీ ఇటుక బట్టీలో  ఒడిషాకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. అయితే, తమను యజమానులు లైంగిక, శారీరక వేధింపులే కాకుండా దౌర్జన్యం చేసి చితకబాదుతున్నారని కూలీలు నేషనల్‌ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో కౌన్సిల్‌ బాధ్యులు ఈ విషయాన్ని కార్మిక శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. కార్మిక శాఖ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కార్మిక, రెవెన్యూ అధికారులు సోమవారం ఇటుక బట్టీల వద్దకు వచ్చి కూలీలతో మాట్లాడారు. తమను యాజమాన్యం హింసకు గురి చేస్తోందని కూలీలు అధికారులకు చెప్పారు. కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ స్వామి, ఇబ్రహీంపట్నం తహశీల్దార్‌ వెంకట్‌రెడ్డి కూలీలందరి అభిప్రాయాలు సేకరించారు. కాగా, విచారణ కోసం బట్టీల వద్దకు వచ్చిన కార్మిక శాఖ అధికారులపై యజమానులు దుర్బాషలాడారు. దాడిచేసేయత్నం చేశారు. దీంతో ఇటుబట్టీల యాజమాన్యం అసోసియేషన్‌ నాయకులు వారిని వారించారు.  

80 మంది కార్మికులనుఒడిషాకు పంపిన అధికారులు
ఇక్కడ పనిచేయడం ఇష్టం లేని కొందరు కార్మికులు తమ ప్రాంతానికి  వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు. తమను పశువులకన్నా హీనంగా  చూస్తున్నారని, కనీస సౌకర్యాలు కల్పించకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని చెప్పారు. డీసీఎం ఎక్కిన గౌతమ్, సంతోష్, ప్రభులను యాజమాన్యం కొట్టారని తెలిపారు. ఇటుక బట్టీలో 17 మంది చిన్నపిల్లలతో కలిపి మొత్తం 80 ఉన్నారు. వీరి స్వగ్రామం ఒడి
షాలోని బొలాంగిరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో కూలీలను వారి స్వస్థలాలకు పంపిస్తామని అధికారులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తామని కార్మిక శాఖ అధికారులు తెలిపారు. 

ఆత్మహత్యకు యత్నించిన యజమాని శ్రీనివాస్‌
అధికారులు వచ్చి మాట్లాడుతుండగా కూలీలు వెళ్లిపోతున్నారని తెలియడంతో యజమాని శ్రీనివాస్‌ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించబోగా పోలీసులు పైకి ఎక్కి రేకులు పగలగొట్టి శ్రీనివాస్‌ని కాపాడారు. కొటిన్నర రూపాయలు పెట్టుబడి పెట్టి మధ్యలో ఆగంచేసి వెళ్లిపోతే ఎట్లా.. వారికి అందరికీ అడ్వాన్స్‌లు చెల్లించాను, నన్ను కాపాడాలని శ్రీనివాస్‌ కోరారు.  అధికారుల బృందంలో కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్,దిల్‌సుఖ్‌నగర్‌ కార్మిక శాఖ అధికారి వినీత, నాచారం అ«ధికారి అరుణ, రెవెన్యు కార్యదర్శి బిక్షపతితో తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు