లాభం లేకున్నా... నష్టాన్ని భరించలేం!

29 Jul, 2019 02:54 IST|Sakshi

రైతుబీమా అమలుపై సర్కారుకు ఎల్‌ఐసీ స్పష్టీకరణ 

ప్రీమియం రూ. 704 కోట్లయితే.. పరిహారం రూ. 735 కోట్లు చెల్లించామని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రైతుబీమా అమలు విషయంలో తమకు లాభం రాకపోయినా పరవాలేదు కానీ... నష్టాన్ని మాత్రం భరించలేమని ఎల్‌ఐసీ తెలంగాణ సర్కారుకు తేల్చిచెప్పింది. అందువల్ల రెండో ఏడాది ఏమాత్రం నష్టం రాకుండా రైతుబీమా ప్రీమియం చెల్లింపులో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే వారి కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల పరిహారం అందేలా గతేడాది ఆగస్టు 14 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రారంభించి, రైతుల తరపున ఎల్‌ఐసీకి ప్రీమియాన్ని చెల్లించింది. ఏడాదిగా ఆ పథకం కింద తాము రైతులకు చెల్లించిన పరిహారం సొమ్ము ఎక్కువగా ఉండటంతో తమకు నష్టం వాటిల్లిందని ఎల్‌ఐసీ చెబుతోంది.

ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. మొదటి ఏడాది పథకం వచ్చే నెల 13తో ముగియనుంది. రెండో ఏడాదికి మరోసారి ఎల్‌ఐసీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. దీంతో ప్రభుత్వంతో ఎల్‌ఐసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. 2018–19లో రైతు కుటుంబాలకు ఏ మేరకైతే పరిహారం చెల్లించామో, అంతే మొత్తాన్ని 2019–20 సంవత్సరానికి ప్రీమియంగా ఇవ్వాలని ఎల్‌ఐసీ కోరుతోంది. దానివల్ల తమకు లాభం రాకపోయినా నష్టం వాటిల్లదని చెబుతోంది. అంటే ‘నో లాస్‌... నో ప్రాఫిట్‌’ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవాలనేది ఎల్‌ఐసీ ఉద్దేశం. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. సీఎంకు విన్నవించాక తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.  

ప్రీమియం రూ. 704 కోట్లు.. 
రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 14 నుంచి ‘రైతు జీవిత బీమా’పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులకు దీన్ని వర్తింపచేస్తున్నారు. ఈ పథకంలో ప్రభుత్వం ఎల్‌ఐసీకి రైతుకు రూ. 2,211.50 వంతున ప్రీమియాన్ని చెల్లించింది. మొదట్లో 29.58 లక్షల మందికి గాను రూ. 612 కోట్లను చెల్లించింది. ఆ తర్వాత అర్హులైన వారు క్రమంగా బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 30.97 లక్షల మంది దీని పరిధిలో ఉండగా, వారి తరపున రూ. 704.16 కోట్ల ప్రీమియాన్ని ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లించింది. 2018 ఆగస్టు 14 అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14,705 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందారు.

వీరి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 735.25 కోట్లు ఎల్‌ఐసీ ద్వారా పరిహారంగా ముట్టింది. అంటే ఎల్‌ఐసీ తీసుకున్న ప్రీమియం కంటే పరిహారం ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఎల్‌ఐసీకి రూ. 31.09 కోట్లు నష్టం వాటిల్లింది. వచ్చే నెల 13 వరకు గడువు ఉండటంతో అప్పటివరకు రైతులు చనిపోతే మరికొంత పరిహారం చెల్లించకతప్పదు. ఈ నేపథ్యంలో ఇది ఎల్‌ఐసీ పరంగా భారమవుతోందని.. ప్రీమియం విషయంలో తాము ఈ ఏడాదిలో ఎంత పరిహారం చెల్లించామో... అంతే మొత్తాన్ని వచ్చే ఏడాదికి ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుందనే ప్రతిపాదనను ఎల్‌ఐసీ అధికారులు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలి.

మరిన్ని వార్తలు