ఏక్‌ దిన్‌ కా రాణి.. ఈ నర్సవ్వ 

10 Dec, 2017 03:02 IST|Sakshi
అక్కాతమ్ముళ్లు నర్సవ్వ, జములయ్య

     మరుగుదొడ్డి ఉంది.. ఇల్లు లేదు.. 

     రేషన్‌ కార్డు ఉంది.. బియ్యం ఇవ్వరు.. 

     వయస్సు 70.. పింఛన్‌ రాదు 

     మతిస్థిమితం లేని తమ్ముడే ఆధారం 

     మురికి కూపం మధ్య జీవనం 

సిరిసిల్ల రూరల్‌: ఇంటి ముందు ఓ వాహనం వచ్చి ఆగుతుంది. ఒంట్లో ఏ మాత్రం సత్తువ లేని ఆ అవ్వను మర్యాదగా అందులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. తమ పని చేయించుకొని మళ్లీ తీసుకొచ్చి ఇంటి ముందు వదిలేస్తారు. ఆ తర్వాత ఐదేళ్లు కనీసం ఆమెను పట్టించుకునేవారే ఉండరు. రాజ న్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన 70 ఏళ్ల జెలిపెటి నర్సవ్వకు మర్యాద దక్కేది ఒక్క పోలింగ్‌ రోజు మాత్రమే. ఆమెకు రేషన్‌ కార్డు.. ఆధార్‌కార్డు ఉన్నా వేలిముద్రలు సరిపోవటం లేదని బియ్యం ఇవ్వటం లేదు. పింఛన్‌ జాబితాలో పేరు లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమి లో గుడిసె వేసుకొని ఉంటోంది. ప్రభుత్వమే కట్టిచ్చిన మరుగుదొడ్డి కూడా ఉంది. కానీ దానిని వినియోగించుకునేందుకు వీలుగాలేదు.

మతిస్థిమితం లేని 68 ఏళ్ల తమ్ముడు జములయ్య బిక్షాటన చేసి.. స్క్రాప్‌.. అట్టముక్కలు ఏరుకొని విక్రయించగా, వచ్చే సొమ్ముతో ఇద్దరూ జీవిస్తున్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన నర్సవ్వ భర్త ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఓ కుమారుడు, ఓ కూతురు ఉండేవారు. కుమారుడు తల్లిని వదిలి వెళ్లిపోయాడు. కూతురు చనిపోయింది. మతి స్థిమితం లేని తమ్ముడు జములయ్య తోడుగా ఉంటున్నాడు. ఇతనికి కంటిచూపు కూడా లేదు. 40 ఏళ్ల క్రితం వీరికి ప్రభుత్వం వడ్డెర కాలనీలో రెండు గుంటల స్థలాన్ని కేటాయించింది.

ఇల్లు కట్టుకునే స్తోమత లేక.. గుడిసె వేసుకుంది. ఇటీవల అది కూలిపోయింది. స్థానికులు స్పందించి పాలిథిన్‌ కవర్‌తో డేరా ఏర్పాటు చేశారు. ప్రభు త్వం వారి కోసం మరుగుదొడ్డిని కట్టించి ఇచ్చింది.  అయితే, గ్రామంలోని డ్రైనేజీ నీరు మొత్తం నర్సవ్వ గుడిసె చుట్టే చేరుతుండడంతో మురుగు దొడ్డి వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. రేషన్‌ కార్డ్‌కు వేలిముద్రలు సరిపోకపోవటంతో బియ్యం పంపిణీ చేయటం లేదు. ఈ క్రమంలో చూపులేని.. మతిస్థిమితం సరిగా లేని జములయ్య బిక్షాటన చేస్తూ.. స్క్రాప్‌.. అట్టముక్కలు ఏరి సంపాదిస్తున్నాడు. ఇరుగు.. పొరుగు పెట్టింది తింటూ అక్కాతమ్ముడు జీవిస్తున్నారు. ఏ పనీ చేసుకోలేని.. కనీస జీవనాధారంలేని ఈ అక్కాతమ్ముళ్లకు అంత్యోదయ కార్డు, పింఛన్‌ మంజూరు చేయటంతో పాటు తాత్కాలికంగా ఇంటిని నిర్మించి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు