జూరాల నుంచే ‘గట్టు’కు ఎత్తిపోతలు

7 Jul, 2018 02:26 IST|Sakshi

సీఎం సూచనతో అధికారుల కసరత్తు 

సాధ్యాసాధ్యాలపై అధ్యయనం మొదలు.. 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలను ఆధారం చేసుకొని గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం స్వరూపం మారే అవకాశం కనిపిస్తోంది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్‌ నీటిని తీసుకుంటూ ఈ పథకాన్ని చేపట్టాలని మొదట నిర్ణయించారు. అయితే ప్రస్తుతం నేరుగా జూరాల ఫోర్‌షోర్‌ నుంచే నీటిని తీసుకునేందుకు యోచిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సూచనల నేపథ్యంలో జూరాల నుంచి నేరుగా తీసుకునే సాధ్యాసాధ్యాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్‌ మండలాల పరిధిలోని 33వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు గత నెల 29న శంకుస్థాపన చేశారు. దీన్ని రెండు విడతలుగా చేపట్టనుండగా, తొలి విడతను రూ.459.05కోట్లు, రెండో విడతను రూ.94.93కోట్లతో చేపట్టనున్నారు.

అయితే గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడు రిజర్వాయర్‌ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడినుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీ సామర్థ్యం ఉన్న పెంచకలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాన్ని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే 4 టీఎంసీల మేర నీటిని రేలంపాడుకు బదులుగా నేరుగా జూరాల ఫోర్‌షోర్‌ నుంచి తీసుకుంటేనే ప్రయోజనం ఎక్కువని ఇటీవల సీఎం అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.  

పెరగనున్న వ్యయం! 
జూరాల ఫోర్‌షోర్, గట్టుకు మధ్య ఉన్న దూరం, మధ్యలో ఉన్న ఆటంకాలు, పెరిగే వ్యయ అంచనాలపై అధికారులు అధ్యయనం మొదలు పెట్టారు. జూరాల నుంచి గట్టుకు నీటి తరలించాలంటే మధ్యలో పెద్ద పెద్ద గుట్టలను దాటాల్సి ఉంటుందని, దానికోసం టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో వ్యయం పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే పూర్తి అధ్యయనం తర్వాతే స్పష్టత వస్తుందని వెల్లడిస్తున్నారు.  

మరిన్ని వార్తలు