కాళేశ్వరంలో ఎత్తిపోతలు తగ్గిద్దామా..?

27 May, 2016 02:07 IST|Sakshi

తమ్మిడిహెట్టి నుంచి నీటి తరలింపుపై పరిశీలన
వ్యాప్కోస్‌కు ప్రభుత్వ ఆదేశం

 

హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో గణనీయంగా ఉన్న విద్యుత్ అవసరాలను తగ్గించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎత్తిపోతలను తగ్గించి.. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న సుందిళ్ల వరకు తరలించే మార్గాలపై అన్వేషణ చేయాలని నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం వ్యాప్కోస్‌కు కట్టబెట్టింది. పెరిగిన విద్యుత్ అవసరాలను తగ్గించడంలో భాగంగా తమ్మిడిహెట్టి రెగ్యులేటర్ ఎత్తును 145 మీటర్ల నుంచి మరో మీటర్‌కు తగ్గించి, వీలైనంత ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా 72వ కిలోమీటర్ వరకు తేవడం, అక్కడి నుంచి వేరే కాల్వ ద్వారా సుందిళ్ల బ్యారేజీలో కలపడం అనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే దీని సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉన్న దృష్ట్యా, ఆ బాధ్యతను వ్యాప్కోస్‌కు కట్టబెట్టింది. వారు తేల్చిన అనంతరమే ఏదైనా నిర్ణయానికి రానుంది.

 
సబ్‌స్టేషన్ల నిర్మాణంపై చర్చలు

కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్చే విద్యుత్‌ను సమకూర్చే బాధ్యతను తీసుకున్న ట్రాన్స్‌కో డెరైక్టర్ సూర్యప్రకాశ్‌తో ప్రాజెక్టు సీఈలు హరిరామ్, వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, టెండర్లు, ఇతర సాంకేతిక అంశాలపై ఆయనతో చర్చించారు. ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్ల నిర్మాణానికి 4,100 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. నిర్మాణ పనులపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ పనులను త్వరగా ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

 

మరిన్ని వార్తలు