రెండు నెలల్లో రెండుసార్లు..

12 Feb, 2019 09:22 IST|Sakshi

ఉస్మానియాలో  మొరాయిస్తున్న లిఫ్ట్‌

డయాలసిస్‌ రోగుల అవస్థలు

దాదాపు రూ. 30 లక్షలతో ఏర్పాటు  

రెండు నెలలకే రెండుసార్లు రిపేర్‌

సుల్తాన్‌బజార్‌: రాష్ట్రంలోనే పేరొందిన ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిలో లిఫ్ట్‌ పనిచేయకపోవడంతో డయాలసిస్‌ కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ లిఫ్ట్‌ వాడకంలోకి వచ్చిన రెండు నెలల గడవక ముందే రెండోసారి మరమ్మతుకు గురికావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వందలాది రోగులకు చికిత్సలు అందించే యురాలజీ, డిమిడ్‌ విభాగాలు ఆపరేషన్‌ థియేటర్లు ఉన్న భవనంలో లిఫ్ట్‌ పని చేయకపోవడంతో డయాలసిస్‌ సెంటర్‌కు వెళ్లేందుకు రోగులు గత కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో అంతస్తు వరకు ఇటీవల మరో లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. అయితే రెండు నెలలు గడవక ముందే లిప్ట్‌  మరమ్మతులకు గురికావడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. రెండో అంతస్తు వరకు కిడ్నీ వ్యా«ధిగ్రస్తులకు లిఫ్ట్‌లో తీసుకువెళ్లి అక్కడి నుంచి మూడో అంతస్తుకు వీల్‌ఛైర్‌లో తరలిస్తుండడంతో రోగులు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు.

కొత్తదైనా ఇబ్బందులే..
ఉస్మానియా క్యూక్యూడీసీ భవనంలోని 3వ అంతస్తుకు రోగులను తీసుకువెళ్లేందుకుగాను 2017 జనవరిలో మరో లిఫ్ట్‌ ఏర్పాటుకు టీఎస్‌ఎంఎన్‌ఐడీసీ శ్రీకారం  చుట్టింది. దాదాపు రూ. 30లక్షలతో లిఫ్ట్‌ నిర్మాణ పనులు ప్రారంభించగా, కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థ దాదాపు ఏడాదిన్నరపాటు పనులను సాగదీసింది. గత నవంబర్‌ 12న పనులు పూర్తికావడంతో డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి దీనిని ప్రారంభించారు. ప్రారంభమైన రెండునెలల్లోనే రెండోసారి మరమ్మతుకు గురికావడం అధికారుల టీఎస్‌ఎంఎన్‌ఐడీసీ పనితీరును చెప్పకనే చెబుతుంది. టీఎస్‌ఎంఎన్‌ఐడీసీ ఎలక్ట్రికల్‌ విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నాసిరకంగా జరగడంతోనే రెండు నెలలకే లిప్ట్‌ పనిచేయకుండా పోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ లిప్ట్‌ రెండునెలల్లో రెండు సార్లు రిపేరీ కావడం పట్ల అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా లిప్ట్‌ను బాగుచేసి డయాలసిస్‌ రోగులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు