అమాంతం ఎత్తేస్తున్నారు..

27 May, 2020 08:32 IST|Sakshi

జాకీలతో  ఇంటి లిఫ్టింగ్‌

పాత ఇళ్ల ఆధునికీకరణ

సమయం..ఖర్చు ఆదా

లాలాపేట:  నగరం ఏటేటా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా ఏటా రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో పాతకాలంలో కట్టిన ఇళ్లు కాస్తా ఇప్పుడు రోడ్డుకంటే చాలా వరకు కిందికి వెళ్లాయి. ఫలితంగా రోడ్లపై నుంచి దుమ్ము,ధూళితో పాటు వర్షా కాలంలో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది. ఫలితంగా నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఉన్న ఫలంగా ఇంటిని కూల్చివేసి కొత్తగా నిర్మాణం చేపట్టాలి. ఇందుకు  ఏళ్ల తరబడి సమయం పడుతుంది. నిర్మాణ ఖర్చులు సైతం రెండు మూడింతలు పెరిగాయి. ఇలాంటి సమయంలో ఉన్న ఇంటిని తక్కువ ఖర్చుతో  అలాగే పైకి ఎత్తే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చింది.  

45 ఏళ్ల పాటు మన్నిక....
ప్రస్తుతం బిల్డింగ్‌ మెటీరియల్‌ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భవనాన్ని కూల్చి తిరిగి నిర్మాణం చేపట్టేందుకు దాదాపు రూ. కోటి వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ లిప్టింగ్‌ ప్రక్రియతో  బిల్డింగ్‌ ఎత్తు పెంచి, ఆధునీకరించేందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుంది. మరో 45 ఏళ్ల పాటు ఇళ్లు పటిష్టంగా ఉంటుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇళ్ల లిప్టింగ్‌తో పాటు ఇతర చోటకు షిప్టింగ్‌ సైతం చేస్తామని వారు పేర్కొన్నారు. 

5 ఫీట్లు పైకి....
వాహనాల టైర్లు మార్చేందుకు ఉపయోగించే  జాకీల సహాయంతో జీ ప్లస్‌ వన్, పైన పెంటౌజ్‌ ఉన్న ఓ భవనాన్ని సైతం అమాంతం ఐదు అడుగుల మేర పైకి లేపుతున్నారు. తార్నాక స్ట్రీట్‌ నెంబర్‌ 3లో రోడ్డు ఎత్తు పెరగడంతో భవనం పూర్తిగా కిందికి వెళ్లింది. దీంతో సదరు ఇంటి యజమాని ఇంటిని పైకి లేపేందుకుగాను చెన్నైకి చెందిన  శివాజీ హౌజ్‌ లిఫ్టింగ్‌ ప్రైవేట్‌ సంస్థకు కాంట్రాక్టు అప్పగించాడు.  15 రోజుల క్రితం ఇంటిని పైకి ఎత్తే  పనులు ప్రారంభించారు. కొద్ది కొద్దిగా ఇంటిని జాకీలతో పైకి ఎత్తుతూ దాని కింద పటిష్టమైన ఐరన్‌ ట్రాక్‌తో పాటు  గోడ నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు అడుగుల మేరకు ఇంటిని పైకి లేపారు. ఇంకా రెండు అడుగులు పెంచాల్సి ఉంది. 

2500 జాకీల వినియోగం

ఇంటిని ఎత్తు పెంచేందుకు 2500 జాకీలను ఉపయోగిస్తున్నారు. 45 రోజుల పాటు హర్యాణాకు చెందిన 25 మంది కార్మికులు లిఫ్టింగ్‌ పనులు చేస్తున్నారు.  వారికి లేబర్‌ చార్జిగా, రూ 10 లక్షలు. బిల్డింగ్‌ మెటీరియల్‌కు మరో రూ 10 లక్షలు ఖర్చవుతుందన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా