అడవి పందుల నుంచి పంటల రక్షణ ఇలా..

28 Aug, 2014 03:14 IST|Sakshi

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : రైతులు ఎన్నో కష్టనష్టాలను భరించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు దాడి చేసి తినేస్తుంటాయి. దీంతో నష్టం భరించలేక రైతులు వ్యవసాయమంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంటుంది. మరికొందరు వాటి కాపలా కోసం రాత్రివేళ నిద్రకు దూరమవుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, జొన్న, వేరుశనగ, పొద్దు తిరుగుడు, పండ్ల తోటలపై అడవి పందుల దాడి ఎక్కువగా ఉంటుంది. పంట ఉత్పత్తులను తినడంతోపాటు వాటి సంచారంతో పంట నాశనం అవుతుంది. తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళ గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తుంటాయి.

 వీటికి వినికిడి, చూపు తక్కువగా ఉన్నా, గ్రహణ శక్తి అధికంగా ఉండడంతో రూర ప్రాంతాల నుంచే పంటలను గుర్తిస్తుంటాయి. నోటి భాగంతో భూమిని లోతుగా తవ్వుతూ మొక్కవేశ్లను పెకిలించి నష్టం కలుగజేస్తుంటాయి. ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామ పంచాయతీ పరిధి బిక్కుతండాకు చెందిన రైతులు రాథోడ్ సర్యనాయక్, దుర్వ మారుతి సాగు చేసిన పెసర, పత్తి పంటలపై ఈ నెల 24న రాత్రి అడవి పందులు దాడి చేశాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవడంపై ప్రత్యేక కథనం.

 కందకం ఏర్పాట్లు
 పొలం చుట్టూ రెండు అడుగులు వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతులో కందకాన్ని తవ్వినట్లయితే అడవి పందులు పొలంలోకి రాకుండా నిరోధించ వచ్చు. అలాగే వర్షాభావ సమయంలో కందకాల్లో నిల్వ ఉన్న నీరు పొలాన్ని తేమగా ఉండేటట్లు కూడా చేస్తుంది.

 రసాయనిక పద్ధతులు
 ఫోరేట్ గుళికలను ఇసుకలో కలిపాలి. చిన్న చిన్న సంచుల్లో కట్టి పంట చుట్టూ అక్కడక్కడా కర్రలను పాతి సంచులను వేలాడదీయాలి. గాలి వల్ల ఫోరేట్ గుళికల ఘాటు రూపంలో పంట చుట్టూ ఆక్రమించకుంటాయి. దీంతో పందులు ఆ వాసనకు అక్కడి నుంచి వెళ్లిపోతాయి.  

  కుళ్లిన కోడిగుడ్ల ద్రావణాన్ని తీసుకుని నీటికి కలిపి పొలం చుట్టూ చల్లాలి. దుర్గంధం వల్ల పంట వాసనను గుర్తించక పందులు అక్కడి నుంచి వెళ్లిపోతాయి.
 
కిరోసిన్‌లో ముంచిన నవారును పంట పొలం చుట్టూ ఏర్పాటు చేస్తే ఆ ఘాటు వాసనకు పందులు పారిపోతాయి.
 
విషపు ఎరలు
 గోధుమ పిండిలో ఉల్లిపాయ, వెల్లుల్లిని మెత్తగా చూర్ణం చేసి కలిపి పొలం చుట్టూ పెట్టాలి. ఈ ఉండలను పందులు తినడం అలవాటు చేసుకుంటాయి. ఆ తర్వాత సోడియం మోనో ఫ్లోరో ఎసిటేట్ లేదా వార్‌ఫెరిన్ కలిపిన ఉండలను పెట్టాలి. వాటిని తిన్న పందులు అజీర్ణానికి లోనై పంట దరిదాపులకు రావు.
 
వెంట్రుకలు వెదజల్లే పద్ధతి
 క్షౌరశాలలో దొరికే వ్యర్థ వెంట్రుకలను సేకరించి పంట పొలం గట్లపై ఒక అడుగు వెడల్పులో చల్లాలి. పంటను నాశనం చేసేందుకు వచ్చిన పందుల ముక్కులోకి వెంట్రుకలు వెళ్లి శ్వాసకు ఇబ్బంది కలుగజేస్తాయి. వీటితోపాటు ఊరపందుల పెంటను పొలం చుట్టూ చల్లితే దుర్వాసనకు ఆ పక్కకు రావు. అలాగే వేటకుక్కలతో పందులను తరమడం, టపాసులు పేల్చడం వంటి పద్ధతుల ద్వారా పంట పొలాలను అడవి పందుల బారి నుంచి రక్షించుకోవచ్చు.
 
జీవ కంచెలు
 ఒక రకమైన పంట పొలాన్ని కాపాడుకోవాలంటే దాని చుట్టూ నాలుగు వరసల్లో మరో పంట మొక్కలను పెంచడం పందుల బారి నుంచి రక్షించుకోవచ్చు. వేరుశనగ పంట పొలం చుట్టూ నాలుగు వరుసల్లో కుసుమ పంటను వేయడం వల్ల ఆ మొక్కకు ఉన్న ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. అలాగే కుసుమ మొక్క వాసన, వేరుశనగ మొక్క వాసన కన్నా ఘాటుగా ఉండడం వల్ల పందులు వేరుశనగ మొక్కను గుర్తించలేకపోతాయి. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి కూడా పంటను రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లను కలిగి ఉండే ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవాలి.

మరిన్ని వార్తలు