గురుకులాల్లో 667 పోస్టులకు  లైన్‌ క్లియర్‌ 

8 Jul, 2019 01:54 IST|Sakshi

కొత్త జోనల్‌ విధానం ప్రకారం నియామకాలు

త్వరలో గురుకుల సొసైటీల నుంచి బోర్డుకు ప్రతిపాదనలు

ఆ తర్వాత నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో పోస్టుల విభజన పూర్తి కావడంతో వాటిల్లో ఖాళీల భర్తీకి గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) దృష్టి సారించింది. కొత్త జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో గతంలో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించిన పోస్టులను కొత్త జోనల్‌ విధానం ప్రకారం భర్తీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం గురుకుల బోర్డు వద్ద 667 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. తాజాగా పోస్టుల విభజన పూర్తి కావడంతో నియామకాలకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో తాజా పోస్టులకు గురుకుల సొసైటీలు మరోమారు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. కొత్త జోనల్‌ విధానం, కొత్త జిల్లాలవారీగా పోస్టులను విభజించిన తర్వాత ప్రతిపాదనలను గురుకుల నియామకాల బోర్డుకు సమర్పిస్తే అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చే వీలుంటుంది. ఈ మేరకు గురుకుల నియామకాల బోర్డు ఆయా సొసైటీలకు సూచనలు చేసింది. అతిత్వరలో సొసైటీల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకొని నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు గురుకుల నియామకాల బోర్డు అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.

కేటగిరీలవారీగా పోస్టుల వివరాలు 
కేటగిరీ                పోస్టులు 
ప్రిన్సిపాల్‌                18 
లైబ్రేరియన్‌                148 
పీడీ (డిగ్రీ), పీడీ            206 
మెస్‌ మేనేజర్‌            31 
స్టాఫ్‌నర్స్‌                31 
కేర్‌ టేకర్‌                15 
ల్యాబ్‌ అసిస్టెంట్‌            62 
కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌    31 
అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌        23 
జూనియర్‌ అసిస్టెంట్‌ కం డీఈఓ    30 
స్టోర్‌ కీపర్‌                15 
క్రాఫ్ట్‌టీచర్‌            10 
ఆర్ట్‌ టీచర్‌                5 
మ్యూజిక్‌ టీచర్‌            5 
స్టాఫ్‌ నర్స్‌    (డిగ్రీ)            12 
పీఈటీ                25   

మరిన్ని వార్తలు